Vrm media
యువతకు ఉపాధి కల్పన కోసం మూడంచెల వ్యూహం అమలు…. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు
*100కు పైగా కంపెనీలలో 5 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించేలా మెగా జాబ్ మేళా నిర్వహణ
*త్వరలో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు కసరత్తు
*9 వేల కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం క్రింద స్వయం ఉపాధి ప్రోత్సాహం
*యువత మత్తు పదార్థాలు, సంఘ విద్రోహ శక్తులకు దూరంగా ఉండాలి
*మధిర పట్టణం రెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సిఎం
ఖమ్మం, ఏప్రిల్ -21:
కోరి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన కోసం ప్రజా ప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
5 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మధిర పట్టణంలోని రెడ్డి గార్డెన్స్ లో సోమవారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ఉద్యోగ మేళాలో 100కు పైగా కంపెనీలు పాల్గొని, 5 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీ ప్రతినిధులు ముందుకు వచ్చారని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
యువత అనేక ఆశలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగిందని, కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా పాలకులు యువత ను నిర్లక్ష్యం చేశారని, యువతకు ఉపాధి అవకాశాలు చూపించడంలో వైఫల్యం చెందారని అన్నారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా మొదట పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రక్షాళన చేసి జాబ్ కేలండర్ విడుదల చేసామని, మొదటి దశలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలోనే మరో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతుందని అన్నారు.
రెండవ దశలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గ్లోబలైజేషన్ లో భాగంగా వస్తున్న మార్పులను అలవర్చుకొని బహుళ జాతుల సంస్థలకు రాష్ట్రంలో అవసరమైన వనరులు కల్పించి భారీ ఎత్తున పెట్టుబడులు, వీటి ద్వారా యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు సాధిస్తున్నామని అన్నారు.
మూడవ దశలో ఉపాధిని ప్రోత్సహించేందుకు 9 వేల కోట్ల పెట్టుబడితో రాజీవ్ యువ వికాసం పథకం క్రింద యువతకు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాడు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నామని, స్వయం ఉపాధి కోసం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు కేటాయించామని అన్నారు.
చదువు పూర్తి చేసుకున్న వారు ఖాళీగా ఉండకుండా, సొంత ఆదాయంతో ముందడుగు వేసేందుకు జాబ్ మేళాలు ఉపయోగపడతాయని, ఇక్కడ ఉద్యోగం పొందిన వారు ఇక్కడితోనే ఆగిపోకుండా ఇది మొదటి మెట్టుగా భావించి వచ్చిన జీతంతో వారి జీవితంలో పెట్టుకున్న గొప్ప లక్ష్యాలను సాధించాలని సూచించారు. నేడు మధిర పట్టణంలో నిర్వహించే జాబ్ మేళా ద్వారా ఒకే రోజు 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.
యువత రాష్ట్రానికి గొప్ప వనరు అని, రాష్ట్ర జిడిపి పెరుగుదలకు, కుటుంబ బాగు కోసం, సమాజానికి పెద్ద ఎత్తున యువత ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. ఖాళీగా ఉండే యువత సంఘ విద్రోహ శక్తులకు, మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలని, చివరి వయసులో తల్లిదండ్రులను బాధపడకుండా చూసుకోవాలని, యువత సన్మార్గంలో నడిచేందుకు జాబ్ మేళాలు ఉపయోగపడతాయని అన్నారు.
రాష్ట్రంలోని యువతకు అవసరమైన స్కిల్ అందించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటిఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా అప్ గ్రేడ్ చేసిందని అన్నారు. నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించాలనే ఆలోచనతో 60 యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణానికి ఒకేసారి 11 వేల 600 కోట్ల నిధులను కేటాయించిందని, ఈ పాఠశాలల ద్వారా నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్య ఉచితంగా అందుబాటులోకి వస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అప్ గ్రేడ్ చేసి అన్ని వసతులు కల్పిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా ఇంచార్జీ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ జీవితంలో విజయం సాధించేందుకు మనపై నమ్మకం ఉండడం చాలా ముఖ్యమని, చిన్న ఉద్యోగమైన మనం చేరితే మనలో విశ్వాసం పెరుగుతుందని, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇది తోడ్పాటు అందిస్తుందని అన్నారు.
యువతకు వచ్చిన అవకాశాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని, జాబ్ మేళాలో వచ్చిన ఉద్యోగాల్లో ఎటువంటి సమస్య వచ్చినా అవసరమైన సహకారం జిల్లా యంత్రాంగం నుంచి అందిస్తామని అన్నారు. మేగా జాబ్ మేళా నిర్వహణలో సహకరించిన డిప్యూటీ సీఎంకు ఇంచార్జి కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మెగా ఉద్యోగ మేళాలో సింగరేణి జనరల్ మేనేజర్ సాలీం రాజు, వివిధ కంపెనీల ప్రతినిధులు, యువత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
VRM MEDIA




యువతకు ఉపాధి కల్పన కోసం మూడంచెల వ్యూహం అమలు…. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు