ప్రియతమ న్యాయమూర్తికి అశ్రు నివాళి
ప్రియదర్శిని
తన నామధ్యేయానికి సార్థకతనందించిన
తెలంగాణ రాష్టోన్నత వికసిత న్యాయ మహిళా న్యాయ మూర్తి.
ఓ చిరునవ్వుల న్యాయమందారం
అర్థాంతరంగా రాలిపోయింది ఈ దినం.
ఆరిపోయింది ఓ ప్రజ్వలిత న్యాయ మణిదీపం.
ఆరుపదులకే నూరేళ్ల ఆయుష్షు నిండినట్టు
కానరాని లోకాలకు ఎగిరిపోయింది న్యాయ విహంగం.
చటుక్కున తెగిపోయింది ఓ న్యాయ పుంజం నివ్వెరపోయింది తెలంగాణ న్యాయ లోకం.
మూగబోయింది గలగలలాడే న్యాయ నారీకంఠం.
నిశ్చలమైన పోయింది ఓ మిళమిళ మెరిసే
న్యాయ తీర్పుల గిరిజా ప్రవాహం.
చెదిరిపోయింది క్రియాశీల మహిళాచైతన్యం
ఆగిపోయింది ఓ దళిత న్యాయ శంఖారావం
అందరి ప్రియ నేస్తమైన ప్రియదర్శిని
మహిళా సాధికారతకు చక్కని నిర్వచనం
జస్టిస్ ప్రియదర్శిని
తనకీలోకంతో రుణానుబంధం పూర్తయిపోయిందని తలచి
విశ్వాంతరాలకు వెళ్లిపోయింది న్యాయాన్వేశియై .
ఆమె
ఓ నిరంతర న్యాయ శ్రమైక జీవి
పదవీ విరమణకు ముందే చేరుకున్నది
పరమపద సన్నిధి.
ఆమె ఓ చదువుల తల్లి
సాహిత్య పిపాసి.
ప్రతిభగల న్యాయమూర్తి
పేద జన పక్షపాతి.
జిల్లా న్యాయమూర్తిగా
నాలుగు జిల్లాల ప్రజలకు ఎనలేని
న్యాయ సేవలనందించింది.
న్యాయవాదులకు మధుర జ్ఞాపకాలను మిగిల్చింది
తెలంగాణ హైకోర్టులో నిండు కుండలా అత్యంత హుందాగా
సాంప్రదాయ బద్ధంగా
వివాదాలకు దూరంగా
చక్కని నడవడితో అందరినీ మెప్పించింది
ఆత్మీయ బంధువై న్యాయార్థుల మన్ననలనందుకొని
అందరి స్మృతిపథంలో చెరగని ముద్రవేసి ఇలా అర్థాంతరంగా
అయిన వాళ్లందరినీ వదిలి
ఆ మహిళామతల్లి వెళ్లిపోవడం
నిజంగా దురదృష్టకరం
అత్యంత బాధాకరం.
జస్టిస్ ప్రియదర్శిని శాశ్వత నిష్క్రమణ తెలంగాణ హైకోర్టుకు ఓ విఘాతం.
గౌరవ న్యాయమూర్తి సమయపాలన అపూర్వం.
ఆమె చూపిన వృత్తి నిబద్ధత అమేయం.
కక్షిదారుల పట్ల ఆమె మానవీయత అనంతం.
అనారోగ్య వేదనను పంటి బిగువున బందించి
అంతర్జాలంలో వర్చువల్ కేసులెన్నో చేపట్టి
మృత్యుదేవత వెంటాడుతున్నా వెరువక
న్యాయ దేవత ఒడిలోనే సేదదీరిన ధీశాలి గౌరవ జస్టిస్ గిరిజా ప్రియదర్శిని
భావితరాలకు నిజమైన మార్గ దర్శిని.
ఎందుకిలా రాశాడో ఆవిధాత
తన నుదుట లోపభూయిష్టమైన
ఆయుష్ రేఖ అని వేధించడం తప్ప ఏం చేయగలం మనం
విధి విధానాన్ని మార్చ లేని మానవ మాత్రులం
"జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ
తస్మాదపరిహార్యే అర్థేన త్వం శోచితుమర్హసి"
మరణం లేని ఆమె పవిత్రాత్మ కు పరలోకంలో సద్గతులు కలిగించమని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ
ఆమె అకాల అంతర్ధానానికి చింతిస్తూ
శోక తప్తహృదయులమై
జస్టిస్ ప్రియదర్శిని కుటుంబ సభ్యులకు
యావత్ తెలంగాణ న్యాయవాదులమంతా
మా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూన్నాం
గౌరవ జస్టిస్ గిరిజా ప్రియదర్శిని గారి న్యాయ సేవలను కొనియాడుతూ
తెలంగాణ హైకోర్టు న్యాయవాదులమంతా
బాధాతప్త హృదయాలతో
అందిస్తున్నాం ఈ అశ్రు నివాళి.
గౌరవ జస్టిస్ గిరిజా ప్రియదర్శిని మేడమ్ అమరహే..

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird