Home ఆంధ్రప్రదేశ్ చరిత్ర కోసం… ఆర్ఆర్ఆర్ తహ తహ..!ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానంపై తెదేపాలో ఉత్కంఠ

చరిత్ర కోసం… ఆర్ఆర్ఆర్ తహ తహ..!ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానంపై తెదేపాలో ఉత్కంఠ

by VRM Media
0 comments

🟢 పోటీకి రె”ఢీ”
🟢 ఖరారుకాని తెదేపా అభ్యర్థిత్వం
🟢 అధినేత ఆదేశాల కోసం ఎదురుచూపు

ఒంటిమిట్ట, ఆగస్టు 2 (ప్రతినిధి):
ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికకు సంబంధించి జిల్లాలో రాజకీయ వేడి చెలరేగుతోంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగగా, అధికార తెలుగుదేశం పార్టీలో అభ్యర్థి ఎంపిక విషయమై ఇంకా స్పష్టత రాలేదు. అయితే స్థానికంగా కీలకంగా అభివృద్ధి చెందిన యువ నేత రఘురాం రెడ్డి పేరు తెదేపా శ్రేణుల్లో తిరుగుతోంది. ఆయన అభ్యర్థిత్వంపై ఆ పార్టీ నేతల ఆశాభావం పెరుగుతోంది.

యువనేత రఘురాం రెడ్డి మీద ఆశలు

బలం, బంధం, వర్గం, అనుభవం అన్నీ కలిగిన యువనాయకుడు రఘురాం రెడ్డి. పార్టీ శ్రేణుల్లో చురుకుగా వ్యవహరిస్తూ, కార్యకర్తలకు మద్దతుగా నిలుస్తూ, యువనేత లోకేష్ మన్ననలు పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఆయన, తాజా ఉపఎన్నికలో ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు.
తనకు పార్టీ అభ్యర్థిత్వం రావాలని నమ్మకం వ్యక్తం చేస్తున్న ఆయన ఇప్పటికే జిల్లా స్థాయి నేతలతో సంప్రదింపులు జరిపారు. గ్రామస్థాయిలో కీలక మద్దతుదారులను కలుపుకుంటూ, నేతల సహకారంతో ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే అధినేత ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఓ వైపు ఎన్నిక.. మరోవైపు అంతర్గత రాజకీయాల హడావిడి
ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాన్ని గతంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భర్తీ చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జిల్లా పరిషత్ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో స్థానిక ఎన్నిక అనివార్యమైంది. అప్పటి నుంచే పలు పేర్లు తెదేపాలో పరిశీలనలో ఉన్నాయి. అయితే అందులో రఘురాం రెడ్డి పేరు ప్రాధాన్యతతో చర్చలోకి రావడం గమనార్హం.
టిడిపి తరఫున అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంలో ఆలస్యం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. పార్టీ అధిష్ఠానానికి అభ్యర్థుల వివరాలు చేరినట్టు సమాచారం.

పార్టీ వర్గాల్లో ఆశాభావం – స్థానికంగా ఉత్సాహం

రఘురాం రెడ్డి అభ్యర్థిత్వంపై పార్టీ స్థానిక నేతలు విశ్వాసంతో ఉన్నారు. పార్టీకి నూతన ఊపునివ్వగల నాయకుడిగా ఆయన్ని అభివర్ణిస్తున్నారు. ప్రజల్లోనూ మంచి మద్దతు ఉన్న నాయకుడిగా ఆయనపై ఆశలు పెరిగాయి. ఆయన బరిలోకి వస్తే గట్టి పోటీగా మారుతుందని వైసీపీ వర్గాల్లోనూ అంచనాలు వినిపిస్తున్నాయి.
ఎలాగైనా పార్టీ పేరు నిలబెట్టాలన్న పట్టుదల
తెదేపా పార్టీకి ఈ ఉపఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. గతంలో వైసీపీ గెలిచిన స్థానాన్ని తిరిగి సాధించాలన్న ధ్యేయంతో శ్రేణులు కదిలిపోతున్నాయి. ఇందులో భాగంగా గట్టి బలం కలిగిన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది. రఘురాం రెడ్డి అటువంటి నాయకుడిగా అందరి చూపులు ఆకర్షిస్తున్నారు.
ఇక ప్రశ్న ఒకటే – అధినేత గ్రీన్ సిగ్నల్ ఎప్పుడే..?
ప్రస్తుతానికి తెదేపాలో అధినేత నిర్ణయం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా, రఘురాం రెడ్డి ఇప్పటికే ప్రచారానికి సిద్ధంగా ఉండడం రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది.

ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి సంబంధించి తెదేపా నుంచి ఎవరికి టికెట్ దక్కబోతుందన్నది త్వరలోనే తేలనుంది. కానీ రఘురాం రెడ్డి పేరు చక్కర్లు కొడుతుండటం, స్థానికంగా అభిమానం పెరుగుతుండటం గమనించాల్సిన అంశాలు.
రాజకీయంగా చరిత్రను మలిచే సమయం సమీపిస్తోంది. రఘురాం రెడ్డి ఆ చరిత్రలో కీలక పాత్ర వహిస్తారా? సమయం సమాధానం చెబుతుంది..!

2,909 Views

You may also like

Leave a Comment