



Vrm media ఖమ్మం ప్రతినిధి
వైభవోపేతంగా గణేష్ శోభాయాత్ర నిర్వహణ …….. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
*వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
ఖమ్మం నగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా గణేష్ శోభాయాత్రను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి గాంధీ చౌక్ వద్ద ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో గణేష్ శోభాయాత్ర వైభవంగా నిర్వహించాలని, 9 రోజుల పాటు భక్తితో నవరాత్రి ఉత్సవాలను చేశామని అన్నారు. గణేష్ శోభా యాత్ర వైభవంగా జరిగేందుకు జిల్లా కలెక్టర్ పోలీస్ కమీషనర్, మేయర్, మున్సిపల్ కమీషనర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు.
ఖైరతాబాద్ మహా గణేష్ శోభా యాత్ర ముగిసి గంగమ్మ తల్లి ఒడ్డుకు చేరుకుందని, ప్రస్తుతం ఖమ్మం నగరంలో శోభాయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. గణేష్ దయవల్ల రాష్ట్రంలో మంచి వర్షాలు పడి పంటలు బాగుండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపే శక్తి ఆ గణనాథుడు ముఖ్యమంత్రికి ఇవ్వాలని కోరారు.
ఖమ్మం జిల్లా పరిపాలన రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేలా కలెక్టర్ నేతృత్వంలో నడపడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఖమ్మం నగరానికి మంచి కార్యక్రమాలు చేసిన కలెక్టర్ గా అనుదీప్ దురిశెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి సూచించారు.
గత సంవత్సరం మున్నేరు నదికి భారీ వరదలు వచ్చి ఖమ్మం ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, గణనాథుని దయవల్ల బాగా పని చేసి ప్రాణ నష్టం జరగకుండా, అన్ని సౌకర్యాలు కల్పించి పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. వినాయకుడి ఆశీర్వాదంతో నగరంలో ప్రారంభించిన కేబుల్ బ్రిడ్జి, రిటైనింగ్ వాల్, ఖమ్మం ఖిల్లా రోప్ వే వంటి అనేక అభివృద్ధి పనులు త్వరగా పూర్తి కావాలని మంత్రి ఆకాంక్షించారు.
గణేష్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాన్ని భక్తులు ప్రశాంతంగా సజావుగా జరుపు కోవాలని, ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగవద్దని అన్నారు. సజావుగా వినాయక నిమజ్జనం నిర్వహించడంలో ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు, అధికారులకు, పోలీసులకు సహకారం అందించాలని మంత్రి సూచించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు ముగించుకుని గణనాథులు నిమజ్జనానికి సిద్ధం అయ్యాయని, మంత్రి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లోటు పాట్లను భర్తీ చేశామని అన్నారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అధికారులకు సంపూర్ణ సహకారం అందించాలని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజల మీద విఘ్నేశ్వరుని ఆశీర్వాధం ఉండాలని ప్రజలందరికీ సుఖసంతోషాలు అందాలని ప్రార్థిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird