
కల్లూరు జూనియర్ కళాశాలకు హాస్టల్ మంజూరు
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Vrm మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడు
కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు హాస్టల్ మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
మంత్రివర్యులు గురువారం కల్లూరు మండలంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి లతో కలిసి పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసారు.
కల్లూరు మున్సిపాలిటీ ప్రాంతంలో మైనారిటీ సంక్షేమ శాఖచే 75 లక్షలతో నిర్మించిన షాదీఖాన భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు యూనిఫామ్, నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని, విద్యార్థులకు యూనిఫామ్, నోట్ పుస్తకాల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కల్లూరు జూనియర్ కళాశాలకు 3.5 కిలో మీటర్ల దూరంలో ఉన్న నారాయణపురం అనే కుగ్రామంలో పుట్టిన తాను, ఇదే కళాశాలలో విద్యార్థిగా చదువుకున్నానని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
10వ తరగతి తర్వాత ఇంటర్ లో చదివేందుకు సైకిల్ మీద కళాశాలకు వస్తూ ఇంటర్ పూర్తి చేయడం జరిగిందని అన్నారు. గతంతో పోలిస్తే నేడు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కళాశాలలో ఉన్న కుటుంబాలలో 90 శాతం వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వారై ఉంటారని అన్నారు.
తల్లిదండ్రుల తాపత్రయం, కష్టం పిల్లలు అర్థం చేసుకుంటే జీవితంలో రాణించే ఆస్కారం ఉంటుందని అన్నారు. జీవితంలో మనం తల్లిదండ్రులు, టీచర్స్, ప్రాంతానికి మంచి పేరు తీసుకుని రావడమే లక్ష్యంగా విద్యార్థులు కష్టపడాలని సూచించారు.
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే సొంత ట్రస్ట్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. విద్యా శాఖలో పెను మార్పులు తీసుకుని వస్తున్నామని, సీఎం స్వయంగా విద్యాశాఖ తన వద్ద ఉంచుకొని ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు.
ఆర్థిక వ్యవస్థ సహకరించక పోయినా గురుకులాల్లో డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్స్ చార్జీలు 200 శాతం పెంచడం జరిగిందని, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, 75 నుంచి 80 కోట్లతో ఏ.టి.సి. సెంటర్ల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలను విద్యాశాఖ క్రింద చేపట్టామని అన్నారు.
కల్లూరు జూనియర్ కళాశాలకు హాస్టల్ మంజూరు చేస్తామని, డిజిటల్ తరగతులకు మెటీరియల్ మంజూరు చేస్తామని మంత్రి అన్నారు. రాబోయే కొద్ది రోజులలో శాశ్వత హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేస్తామని అన్నారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* జూనియర్ కళాశాల విద్యార్థి జీవితంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని, ఇంటర్ లో బాగా చదివితే మంచి ఇంజనీరింగ్, మెడికల్, ఇతర వృత్తి నైపుణ్య కళాశాలలో సీటు లభిస్తుందని , దీని వల్ల విద్యార్థికి మంచి కెరియర్, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
ప్రస్తుత సమయం చాలా కీలకమైందని దీనిని విద్యార్థులు బాగా ఉపయోగించుకొని బాగా చదువుకోవాలని అన్నారు. హాస్టల్ భవనం ప్రతిపాదనలు, డిజిటల్ తరగతులకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసే దిశగా జిల్లా యంత్రాంగం తరపున చర్యలు తీసుకుంటామని అన్నారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ* అన్న అంటే నేను ఉన్నా అంటూ అనునిత్యం ప్రజలలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి మంత్రివర్యులు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. కల్లూరు జూనియర్ కళాశాలకు హాస్టల్ భవనం, ఫర్నిచర్ మంజూరు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
మనం ఎలా ఎక్కడ పుడుతున్నామో మన చేతిలో ఉండదని, మన భవిష్యత్తు మాత్రం మన చేతుల్లోనే ఉంటుందని అన్నారు. ఈరోజు స్టేజ్ పై ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి నేడు ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందని అన్నారు.
ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని భవిష్యత్తు లో మంచి స్థాయికి చేరుకోవాలని, పిల్లలకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పిస్తామని, లెక్చరర్ల మాట వింటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు.
వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలను చూసి కష్టపడితే బాగుపడతామని ఆలోచన ప్రతి ఒక్కరు తెలుసు కోవాలని అన్నారు. ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకొని, కష్టపడి సాధన దిశగా కృషి చేయాలన్నారు.
అనంతరం కల్లూరు లో 75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంబేద్కర్ లైబ్రరీ భవనం, రీడింగ్ రూం నిర్మాణ పనులకు మంత్రివర్యులు శంకుస్థాపన చేశారు. కల్లూరు మార్కెట్ యార్డ్ లో బతుకమ్మ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, పీఆర్ ఎస్ఇ జి. వెంకట్ రెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహ్మద్ ముజాహిద్, కల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాగం నీరజ దేవి, కల్లూరు మునిసిపల్ కమీషనర్ సంపత్ కుమార్, తహసీల్దార్ పులి సాంబశివుడు, ఎంపిడివో చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నరు
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.