
దర్శకులు ఒక మంచి కథ కోసం ఎంత కృషి చేస్తారో తమ సినిమాలోని పాటల విషయంలో కూడా అంతే శ్రద్ధ పెడతారు. ఎక్కువ సమయం తీసుకొని మధురమైన పాటలు తమ సినిమాలో ఉండేలా చూసుకుంటారు. మన సినిమాల పాటలు ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి రూపాంతరం చెందుతూ వచ్చాయి. పూర్వ సినిమా ఇండస్ట్రీకి కొత్త దర్శకులు వస్తున్నారు. వారు ఎంపిక చేసుకున్న కథకు తగ్గట్టు, వారి అభిరుచి మేరకు పాటలు రాస్తూ వస్తున్నారు గేయ రచయితలు. అలా 2000 సంవత్సరం వచ్చేసరికి మరోసారి తెలుగు సినిమా పాట రూపాంతరం చెందింది. 2000 దశకంలోనే, కొంతమంది యువ దర్శకులు సరికొత్త కథలతో ఆలోచనలతో ఇండస్ట్రీకి వచ్చారు. అలా వచ్చినవారిలో పూరి జగన్నాథ్, రాజమౌళి, వి.వి.వినాయక్ వంటి ప్రముఖ దర్శకులు ఉన్నారు.
తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కించిన ఈ డైరెక్టర్లు తమ సినిమాల్లోని పాటలు కూడా విభిన్నంగా ఉండాలని కోరుకునేవారు. అలాంటి సమయంలోనే గేయ రచయితగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు భాస్కరభట్ల రవికుమార్. సినిమా జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి తను గమ్యంగా ఎంపిక చేసుకున్న సినిమా రంగం వైపు అడుగులు వేశారు. 2000లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘గొప్పింటి అల్లుడు’ చిత్రంలో తొలి పాట రాశారు భాస్కరభట్ల. అప్పట్లో తెలుగు సినిమా ట్రెండ్‌ని ఒక్కసారిగా మార్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. అప్పటివరకు రాణి కొత్త కథాంశాలతో సినిమాలు రూపొందించి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. సినిమా పాటను కొత్త పుంతలు తొక్కించాలని ఉవ్విళూరుతున్న భాస్కరభట్లకి మంచి అవకాశం దక్కింది. పూరి జగన్నాథ్‌తో పరిచయం ఏర్పడడం, ఇద్దరి ఆలోచనలు ఒకటే కావడంతో బాగా ట్యూన్ అయ్యారు. అప్పటివరకు కొన్ని పాటలు రాసిన భాస్కరభట్ల కెరీర్ పూరి పరిచయంతో ఒక్కసారిగా టర్న్ అయింది.
రవితేజ హీరోగా పూరి రూపొందించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ చిత్రంలో భాస్కరభట్ల రాసిన ‘రామ సక్కని బంగారు బొమ్మ.. రాసలీలకు వస్తావా..’ పాట చాలా పెద్ద హిట్ అయింది. అప్పుడు మొదలైన పూరి, భాస్కరభట్ల జర్నీ.. పాతిక సంవత్సరాలుగా దిగ్విజయంగా కొనసాగుతోంది. పూరి చివరగా చేసిన డబుల్ ఇస్మార్ట్ వరకు ప్రతి సినిమాలోనూ రెండు నుంచి 4 పాటలు రాస్తూ పూరికి అత్యంత ఆత్మీయుడిగా మారిపోయారు భాస్కరభట్ల. ఇతర దర్శకులు రూపొందించిన అనేక సినిమాలకు సూపర్‌హిట్ సాంగ్స్ రాసినప్పటికీ పూరి సినిమాల్లో పాటలు భాస్కరభట్లకు ప్రత్యేకం అని చెప్పాలి. యూత్‌కి నచ్చేలా, ట్రెండ్‌కి తగ్గట్టు కొత్త కొత్త పదాలను తన పాటల్లో పొందుపరుస్తూ పాటలు రాయడం భాస్కరభట్లకు పెన్నుతో పెట్టిన విద్య.
పాతిక సంవత్సరాలుగా గేయ రచయితగా ఉంటూ నిర్విరామంగా పాటలు రాస్తున్న భాస్కరభట్ల.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలో రాసిన మరో అద్భుతమైన పాటతో వార్తల కెక్కారు. ‘మీసాల పిల్లా.. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా..’ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. మెగాస్టార్ ఇమేజ్‌కి తగ్గట్టు చక్కని పదాలతో కూర్చిన ఈ పాట భాస్కరభట్లలోని ప్రావీణ్యాన్ని తెలియజేస్తోంది. ‘కుందేలుకు కోపం వస్తే.. చిరుతకు చెమటలు పట్టేలా..’, ‘గుండెల్లో ముల్లు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా..’, ‘నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా..’ వంటి పద ప్రయోగాలు కొత్తగా అనిపించడమే కాకుండా ఎంతో ఫన్‌ని జనరేట్ చేశాయి. ఇప్పుడీ పాట ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అనిల్ రావిపూడి సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’లో భాస్కరభట్ల రాసిన ‘గోదారి గట్టు మీద రామసిలకవే…’ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పాటకి కూడా అదే ఫార్ములాను ఫాలో అయి మరో బ్లాక్‌బస్టర్ సాంగ్ రాసి సంచలనం సృష్టిస్తున్నారు భాస్కరభట్ల రవికుమార్.