Home ఎంటర్‌టెయిన్మెంట్ ఆనాటి నవ్వులు ఏవమ్మా.. కనుమరుగవుతున్న హాస్యానికి ఇక దిక్కెవరు? – VRM MEDIA

ఆనాటి నవ్వులు ఏవమ్మా.. కనుమరుగవుతున్న హాస్యానికి ఇక దిక్కెవరు? – VRM MEDIA

by VRM Media
0 comments
ఆనాటి నవ్వులు ఏవమ్మా.. కనుమరుగవుతున్న హాస్యానికి ఇక దిక్కెవరు?



‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవటం ఒక రోగం..’ ఇది హాస్యబ్రహ్మ జంధ్యాల చెప్పిన సూక్తి. ఇది అక్షరాలా నిజం అనేది అందరికీ తెలిసిన విషయమే. నవ్వు నాలుగు విధాల చేటు అనేది పెద్దల నానుడి. కానీ, నవ్వు నాలుగు విధాలా గ్రేటు అనేది ఇప్పటి నానుడి. తెలుగు వారు హాస్యప్రియులు అనే విషయం అందరికీ తెలిసిందే. హాస్యాన్ని ఆస్వాదించాలంటే తెలుగు వారి తర్వాతే ఎవరైనా. అందుకే టాలీవుడ్‌లో హాస్య నటుల సంఖ్య ఎక్కువ. ఏ భాషలోనూ లేనంతగా మనకు 40 మంది కమెడియన్స్‌ ఉన్నారు. ఇది పది సంవత్సరాల క్రితం మాట. ఆమధ్య వరసగా చాలా మంది కమెడియన్స్‌ మనకు దూరమయ్యారు. అదే సమయంలో చక్కని హాస్యం కూడా కనుమరుగైపోయింది. ఈమధ్యకాలంలో రిలీజ్ అయిన కొన్ని హాస్య చిత్రాలను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.

సినిమా పుట్టిన నాటి నుంచి 1980వ దశకం వరకు సినిమాల్లో హాస్యం అనేది ఒక భాగంగానే ఉండేది. ప్రధాన కథాంశంతో పాటు పార్యలల్‌గా కామెడీ ట్రాక్‌ కూడా రన్‌ అయ్యేది. కథలో ఎంత సెంటిమెంట్ ఉన్నా.. మధ్యలో వచ్చే ఈ కామెడీ ట్రాక్.. ప్రేక్షకులకు రిలీఫ్‌నిచ్చేది. అంతేకాదు, అప్పుడప్పుడు పూర్తి స్థాయి హాస్య చిత్రాలు కూడా వచ్చేవి. వాటిని కూడా ప్రేక్షకులు విపరీతంగా ఆదరించేవారు. 1980 తర్వాత హాస్య చిత్రాల రూప రేఖలు మారాయి. పూర్తి స్థాయిలో ప్రేక్షకులను నవ్వించగల దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారు. 1981లో ఒక నెల తేడాతో రేలంగి నరసింహారావు రూపొందించిన ‘నేను మా ఆవిడ’, జంధ్యాల దర్శకత్వంలో రూపొందించిన ‘ముద్ద మందారం’ చిత్రాలు విడుదలయ్యాయి. నేను మా ఆవిడ పూర్తి స్థాయి హాస్య చిత్రం కాగా, ముద్దమందారం ప్రేమకథ ఉంటూనే హాస్య ప్రధానంగా సాగే సినిమా. ఈ రెండు సినిమాలూ ఘనవిజయం సాధించాయి. రేలంగి, జంధ్యాల డైరెక్ట్‌ చేసిన మొదటి సినిమాలవి.

ఇక అక్కడి నుంచి తెలుగు సినిమాల్లో హాస్యం ప్రధానంగా వచ్చి చేరింది. ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా రేలంగి, జంధ్యాల పోటీలో పడి వరసగా కామెడీ సినిమాలు చేశారు. వాటిలో ఎక్కువ శాతం ఘనవిజయం సాధించిన సినిమాలే కావడం విశేషం. ఆ తర్వాతి కాలంలో కామెడీ ప్రధానంగా డైరెక్టర్లు టాలీవుడ్‌కి రావడానికి వీరిద్దరే కారణం. 45 సంవత్సరాల క్రితం మొదలైన కామెడీ సినిమాల జోరు 2010 వరకు సజావుగానే సాగింది. అయితే 2001లో కామెడీ సినిమాలకు పెద్ద దిక్కుగా ఉన్న జంధ్యాల కన్నుమూశారు. తెలుగు సినిమా కామెడీ రూపాంతరం చెందడంతో రేలంగి నరసింహారావుకి కూడా అవకాశాలు తగ్గాయి. కామెడీని మాత్రమే నమ్ముకున్న ఆయన సినిమాలకు దూరమయ్యారు.

రేలంగి, జంధ్యాల, వంశీ, ఇ.వి.వి.సత్యనారాయణ, ఎస్‌.వి.కృష్ణారెడ్డి వంటి దర్శకులతోపాటు మరికొందరు దర్శకులు ఆరోగ్యకరమైన కామెడీ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. గత 15 సంవత్సరాలుగా టాలీవుడ్ డైరెక్టర్లు యాక్షన్‌, ఫ్యాక్షన్‌ సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో పూర్తి స్థాయి హాస్య చిత్రాలు కనుమరుగైపోయాయి. ప్రస్తుతం ఆ పేరుతో వస్తున్న సినిమాలు హాస్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయి తప్ప ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. అయితే కొంతలో కొంత బెటర్‌గా అనిల్‌ రావిపూడి వంటి దర్శకులు హాస్యాన్ని బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో కాదు.

మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా కొందరు యువకులు కామెడీ సినిమాల పేరుతో చేస్తున్న అరాచకం మామూలుగా ఉండటం లేదు. కామెడీ పేరుతో డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, జుగుప్సను కలిగించే సన్నివేశాలను జొప్పించి ప్రేక్షకులతో ఆడుతున్నారు. యూత్‌ అలాంటి కామెడీనే ఇష్టపడుతోంది అనే సాకుతో తమలోని పైత్యాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. పేరుకే పూర్తి స్థాయి కామెడీ సినిమాలు. అయితే చక్కిలిగింతలు పెట్టినా నవ్వు రాణి స్థాయిలో ఉంటున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ని చూస్తుంటే ఆరోగ్యకరమైన హాస్యం చచ్చిపోయింది అని చెప్పడానికి అనేక సినిమాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులోనైనా ఈ తీరు మారుతుందేమో, ప్రేక్షకులు కోరుకునే హాస్యం తెలుగు సినిమాల్లో కనిపిస్తుందేమో చూడాలి.

2,806 Views

You may also like

Leave a Comment