

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ అన్నా, కమర్షియల్ అన్నా మొదట గుర్తుకొచ్చేది ఆయన పేరు. విజయంతో ఘనంగా దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన బోయపాటి.. తన కెరీర్‌లో పలు ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. త్వరలో ‘అఖండ-2’తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సందర్భంగా బోయపాటి కెరీర్‌లో హిట్స్ ఫ్లాప్స్ ఏంటి? ఆయన సినీ ప్రయాణం ఎలా సాగుతుంది? అనేది పరిశీలిద్దాం.
భద్ర:
రవితేజ హీరోగా దిల్ రాజు నిర్మించిన ‘భద్ర’ సినిమాతో బోయపాటి దర్శకుడిగా పరిచయమయ్యారు. 2005 వేసవిలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్ ఇలా అన్నీ సరిగ్గా కుదిరి.. ఫుల్ మీల్స్ లాంటి సినిమా అనిపించింది. అందుకే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు సాధించి, సూపర్ హిట్ గా నిలిచింది.
నిజానికి భద్ర సినిమా జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సి ఉంది. ఈ కథను మొదట ఎన్టీఆర్ కే వినిపించాడు బోయపాటి. కానీ, ఎందుకనో ఎన్టీఆర్ చేయలేకపోయాడు. దాంతో ఈ సూపర్ హిట్ ఫిల్మ్ రవితేజం చెంతకు చేరింది. ‘భద్ర’ లాంటి సినిమాని ఎన్టీఆర్ మిస్ చేసుకోవడంపై.. ఇప్పటికీ ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు.
తులసి:
ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ ఉన్న వెంకటేష్ తో, తులసి లాంటి క్లాస్ టైటిల్ తో బోయపాటి చేసిన మాస్ మ్యాజిక్ ఇది. భద్ర బాటలోనే ఇది కూడా యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్ తో నిండిన ఫుల్ మీల్స్ లాంటి సినిమా. ఇందులో వెంకటేష్ ఎంతలా నవ్విస్తాడో, అంతల రౌద్ర రూపంతో విలన్స్ ని వణికిస్తాడు. ఈ సినిమా కాసుల వర్షం కురిపించి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
సింహా:
ఈ సినిమా ఒక చరిత్ర అని చెప్పవచ్చు. సింహా విషయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. వరుస ఫ్లాప్స్ లో ఉన్న బాలకృష్ణకు సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చి.. అభిమానుల ఆకలి తీర్చింది. బోయపాటికి హ్యాట్రిక్ హిట్ అందించడమే కాకుండా, తిరుగులేని మాస్ డైరెక్టర్ గా నిలబెట్టింది. అన్నింటికంటే ముఖ్యంగా బాలయ్య-బోయపాటి బస్టర్ కాంబినేషన్ కి సింహాతోనే పునాది పడింది. బాక్సాఫీస్ దగ్గర గర్జించిన ఈ చిత్రం.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
దమ్ము:
‘భద్ర’ లాంటి సూపర్ హిట్ ని మిస్ చేసుకున్న ఎన్టీఆర్.. దమ్ము కోసం బోయపాటితో చేతులు కలిపాడు. సింహా తర్వాత బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో పాటు, ఎన్టీఆర్-బోయపాటి కాంబో కావడంతో.. విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయిన దమ్ము.. యావరేజ్ తో సరిపెట్టుకుంది.
లెజెండ్:
సింహా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వచ్చిన మూవీ లెజెండ్. ఈ జనరేషన్ లో బాలయ్యను సరిగ్గా చూపించాలంటే బోయపాటి తర్వాతే ఎవరైనా అనేలా ఈ సినిమాతో నిరూపించుకున్నారు. బాక్సాఫీస్ ముంగిట వసూళ్ల తుఫాన్ సృష్టించిన లెజెండ్.. సింహాను మించిన విజయం సాధించింది.
సరైనోడు:
అల్లు అర్జున్ ని మాస్ కి చేరువ చేసిన ‘సరైనోడు’ సినిమా అనడంలో సందేహం లేదు. అల్లు అర్జున్ ని కొత్తగా చూపిస్తూ, అదిరిపోయే కమర్షియల్ సినిమాని అందించారు బోయపాటి. ఈ చిత్రంతో ఆయన మరో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా బోయపాటితో సినిమా చేయడానికి బన్నీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే.. సరైనోడు ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
జయ జానకి నాయక:
ఒక యంగ్ హీరోతో ఇలాంటి యాక్షన్ సినిమా తీయడం బోయపాటికే చెల్లిందని చెప్పవచ్చు. 2017లో వచ్చిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా నిలబెట్టడమే కాకుండా నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది.
వినయ విధేయ రామ:
రంగస్థలం వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా ఇది. బోయపాటి రూపొందించిన ఈ యాక్షన్ ఫిల్మ్.. భారీ అంచనాల నడుమ 2019 సంక్రాంతికి విడుదలై, అంచనాలకు అందుకోలేకపోయింది. అయినా మంచి వసూళ్ళు సాధించి, యావరేజ్ అనిపించుకుంది.
అఖండ:
సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ఇది. 2021 లో ఆక్యుపెన్సీ, లో టికెట్ రేట్లు వంటి అడ్డంకులను దాటి సంచలన వసూళ్లతో అఖండ విజయం సాధించిన ఈ సినిమా.
స్కంద:
చాక్లెట్ బాయ్ రామ్ పోతినేనితో బోయపాటి తెరకెక్కించిన ఊర మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘స్కంద’. రామ్ ఇమేజ్ కి మించిన సినిమా అనిపించినా.. వరల్డ్ వైడ్ గా రూ.60 కోట్ల గ్రాస్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
బోయపాటి తన కెరీర్ లో పలు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. కొన్ని సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి.. మంచి వసూళ్లతో సత్తా చాటాయి. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు, హీరోలు ఆసక్తి చూపుతారు.
డిసెంబర్ 5న ‘అఖండ-2’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు బోయపాటి శ్రీను. అసలే బాలయ్య-బోయపాటి కాంబో, దానికి తోడు ‘అఖండ’ సీక్వెల్ అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ‘అఖండ-2’తో బోయపాటి మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకోవడం ఖాయమనే అభిప్రాయం ఇప్పటికే అభిమానుల్లో ఉంది.