Home వార్తలు మరో ప్రాణంలో బతికే ఉందా! – VRM MEDIA

మరో ప్రాణంలో బతికే ఉందా! – VRM MEDIA

by VRM Media
0 comments
మరో ప్రాణంలో బతికే ఉందా!


కండ్లు దానం చేస్తే వచ్చే జన్మలో గుడ్డివారిగా పుడతామట.. ఏ అవయవం దానం చేస్తామో ఆ అవయవం లేకుండానే వచ్చే జన్మ ఉంటుంది.. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్లే దేశంలో అవయవ దానం రేటు అత్యంత దారుణంగా ఉంది. ప్రజల్లో అవగాహన లేకపోవడం, చాలా మందికి అవయవదానం గురించి తెలియకపోవడం, దాని ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోకపోవడం వంటి కారణాలు కూడా దానానికి అడ్డుకట్టగా ఉన్నాయి. మరోవైపు, సాంస్కృతిక, మతపరమైన విశ్వాసాలు అవయవదానానికి అడ్డంకిగా మారాయి. అంతేకాదు.. అవయవాల సేకరణకు వైద్య సేవలు, వైద్య నిపుణులు కూడా తక్కువగా ఉండటంతో ఎంతో మందికి కొత్త జీవితం దక్కడం లేదు. వాస్తవానికి, అవయవాలను దానం చేయడం ద్వారా ఎనిమిది మందికి పైగా ప్రాణాలను కాపాడవచ్చు. ఒకే దాత అందించే గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, క్లోమం వంటి అవయవాలు, ఇతరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయి. కండ్లు దానం చేయడం ద్వారా ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు అవయవ మార్పిడి కోసం ఉన్నారు. వైద్య విజ్ఞానం ఎంతగానో పురోగమించినప్పటికీ, దెబ్బతిన్న కీలక అవయవాలకు ప్రత్యామ్నాయంగా పనిచేసే కృత్రిమ పరికరాలు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మృత్యువు అంచున నిలిచే ఈ ప్రాణాలను కాపాడగలిగే ఏకైక మార్గం అవయవ దానం. ఇది కేవలం వైద్య ప్రక్రియ కాదు; ఇది మానవత్వం ఉట్టిపడే మహోన్నతమైన కార్యక్రమం. కాబట్టి దేశ భవిష్యత్తుకు ఆయువుపట్టుగా నిలిచే నేటి యువతరం, ఈ సామాజిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలి. అవయవ దానంపై ఉన్న అపోహలను తొలగించి, వాస్తవాలను ప్రచారం చేసే దిశగా సోషల్ మీడియాను ఉపయోగించాలి. ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేయాలి. కళాశాలలు, కార్యాలయాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా అవయవ దానం ప్రాముఖ్యత గురించి చర్చలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. మతపరమైన ఆచారాలు, శరీరానికి జరిగే హాని వంటి తప్పుడు నమ్మకాలను శాస్త్రీయ దృక్పథంతో ఖండించాలి. అన్ని మతాలు మానవతా విలువలకు అత్యంత ప్రాధాన్యాన్ని తెలియజేయాలి. అవయవ దానం చేయాలనే తమ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులతో స్పష్టంగా పంచుకోవాలి. ఎందుకంటే, దాత మరణాంతరం తుది నిర్ణయం తీసుకునేది కుటుంబమే. క్రమంగా ‘అవయవ దాత ప్రతిజ్ఞ’ పత్రంపై సంతకం చేసి, తమ సంకల్పాన్ని అధికారికంగా నమోదు చేసుకోవాలి. అవయవ దానం అనేది గొప్ప త్యాగం కాదు, అది ఒక పవిత్రమైన బాధ్యత. మనం మరణించిన తర్వాత కూడా మన శరీరంలోని భాగాలు మరొకరిలో ప్రాణంగా కొట్టుమిట్టాడుతాయంటే, అంతకుమించిన సంతృప్తి మరొకటి ఉండదు. ప్రతి యువకుడు ‘నేను సైతం’ అంటూ ముందుకు వచ్చి, ఈ మహత్కార్యంలో భాగస్వామి కావాలి. మన చిన్న నిర్ణయం అనేక కుటుంబాలలో ఆనందపు వెలుగులు నింపుతుంది. మానవత్వపు విలువలను చాటే ఈసద్వినియోగం చేసుకుందాం, జీవన జ్యోతిని పదిలంగా ఉంచుదాం.

– అలేఖ్య కట్కం

గతం గతః: రోహిత్ శర్మ
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,825 Views

You may also like

Leave a Comment