Home వార్తలు నిద్ర పక్షవాతం – VRM MEDIA

నిద్ర పక్షవాతం – VRM MEDIA

by VRM Media
0 comments
నిద్ర పక్షవాతం


పక్షవాతానికి, నిద్ర పక్షవాతానికి చాలా తేడా ఉంది, నిద్ర పక్షవాతాన్ని, పక్షవాతంతో పోల్చలేము. మన శరీరంలో ఏదైనా భాగానికి పక్షవాతం వస్తే దాదాపు ఆ అవయవం కదలకుండా ఉండిపోతుంది. కానీ నిద్రపక్షవాతంలో కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది, తర్వాత మన శరీరం యధాస్థితికి వస్తుంది. చాలామందికి నిద్ర పక్షవాతానికి గురైన విషయం కూడా వారికి గుర్తు ఉండదు. నిద్ర పక్షవాతం అంత ప్రమాదకరమైనది కాదు. కానీ దీని లక్షణాల వలన మనం భయాందోళనలకు అవకాశం ఉంది. నిద్ర పక్షవాతం ఉన్నప్పుడు మెలకువగా ఉన్నా కూడా శరీరాన్ని కడపలేరు. కాళ్ళు కానీ చేతులు కానీ కదిలించే ప్రయత్నం చేసినా వీలుకాదు. ఈ స్థితిలో ఉన్నప్పుడు మీరు మాట్లాడాలి అనుకున్నా కూడా మాట్లాడలేరు. నిద్ర పక్షవాతం ఉన్నప్పుడు కొద్ది క్షణాల పాటు శ్వాస ఆడకపోవడం, ఛాతీ పైన బరువుగా అనిపించడం జరుగుతాయి. కానీ వెంటనే మాములు స్థితికి వచ్చేస్తారు. చుట్టూ ఎవరో ఉన్నట్టు ఎదో జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది, ఇది కలలో కూడా జరగదు, మెలకువలో ఉన్నప్పుడు ఇలాంటి భ్రాంతి చెందుతారు. నిద్ర పక్షవాతం ఉన్నవారికి పగటి పూట నిద్రమత్తు అధికంగా ఉంటుంది.

నిద్ర పక్షవాతం ఎందుకు వస్తుంది?

నిద్ర పక్షవాతం రావడానికి గల కారణాలు కచ్చితంగా తెలియనప్పటికీ కొన్ని కారణాల వలన సంభవించే అవకాశం ఉందని గమనించవచ్చు. నిద్ర పక్షవాతానికి ముఖ్యమైన కారణం ప్రతీరోజూ సరైన నిద్ర లేకపోవడం, సాధారణంగా మనకి వయసుని బట్టి రోజుకి 7 నుండి 9 గంటల పాటు నిద్ర అవసరం, కానీ ప్రతీరోజూ తక్కువ సమయం నిద్రించే వారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. రాత్రి సమయాల్లో పని చేసేవారిలో కూడా నిద్ర పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. నిద్ర వేళల్లో మార్పులు పగటి పూట సరిగా నిద్ర పోకపోవడం రాత్రంతా మేలుకుని పని చేయడం వలన నిద్ర పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. ప్రతీరోజూ నిద్రపోయే వేళలు క్రమరహితంగా ఉండటం వలన నిద్ర పక్షవాతం సంభవించే ప్రమాదం ఉంది. ఎక్కువగా పని ఒత్తిడి, ఆందోళన కలిగిన వారు ఇతర మానసిక సమస్యలు కలిగిన వారికి నిద్ర పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. నార్కోలెప్సీ వ్యాధి ఉన్నవారిలో నిద్ర పక్షవాతంకు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నార్కోలెప్సీ అంటే ఏదైనా పని చేసే సమయంలో కూడా నిద్రలోకి జారుకునే వ్యాధి.

నిద్రలో ఛాతి బరువుగా ఉంటుందా?

నిద్ర పక్షవాతాన్ని బట్టి రెండు రకాలుగా విభజించొచ్చు. ఒకటి.. ఐసోలేటెడ్ స్లీప్ పెరాలసిస్. ఇది నిద్రకు సంబంధించిన సమస్యల వలన కాకుండా ఉన్నఫళంగా సంభవిస్తుంది, నిద్ర, మేల్కొనే సమయానికి మధ్య కొన్ని క్షణాలపాటు కదల్లేని పరిస్థితి ఉంటుంది. ఇది ఎప్పుడైనా ఒక్కసారి ఉన్నట్టుండి జరుగుతుంది. రెండోది.. రిక్కరెంట్ ఐసోలేటెడ్ స్లీప్ పెరాలసిస్. ఇది ఓకే రాత్రి అనేకసార్లు, లేదా తరచుగా ఇలాంటి పరిస్థితికి గురవ్వడాన్ని రిక్కరెంట్ ఐసోలేటెడ్ స్లీప్ పరాలైసిస్ అంటారు.

నివారణ మార్గాలు

నిద్ర పక్షవాతం ప్రమాదకరమైన వ్యాధి కాదు. కానీ ఈ పరిస్థితి పేషెంట్ లో తరచుగా కనిపిస్తే అప్పుడు కొన్ని యాంటీప్రెసెంట్ మందులను డాక్టర్లు సూచిస్తారు. కొన్ని రకాల వ్యాయామం, జీవనశైలిలో మార్పులు చేయడం వలన నిద్ర పక్షవాతాన్ని నివారించవచ్చు. చాలామందిలో కనీస శారీరక శ్రమ లేకపోవడం వలన ఆరోగ్యకరమైన నిద్ర పట్టదు, మంచి నిద్ర కోసం డాక్టర్లు సూచించిన తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. ప్రతీరోజూ రెండు గంటలపాటు నడక కూడా మంచి నిద్రను ప్రేరేపిస్తుంది. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, కెఫిన్ కలిగిన పదార్ధాలు నిద్రను దూరం చేస్తాయి, నిద్రలేమి వలన నిద్ర పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. అందువలన ఇలాంటి పదార్ధాలను తగ్గించాలి. అనేక అనారోగ్యాలకు కారణమయ్యే మద్యపానం, ధూమపానం అలవాట్లు నిద్ర పక్షవాతానికి కూడా కారణమవుతున్నాయి, ఈ అలవాట్లను తగ్గించుకోవడం వలన నిద్రపక్షవాతం రాకుండా నివారించవచ్చు. ప్రస్తుతం అన్నివయసుల వారు సెల్ ఫోన్ లేదా లాప్టాప్ ఎక్కువగా వాడడం ఎక్కువైంది, పనిలో భాగంగానే వీటిని వాడుతున్నా కూడా అనవసరమైన సమయాల్లో టీవీ, మొబైల్ చూడడాన్ని తగ్గించాలి.

– డాక్టర్ వినమ్ర, లైఫ్ కేర్ హాస్పిటల్స్

Daily Horoscope | ఈ రోజు రాశి ఫలాలు 28 నవంబర్ 2025
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,819 Views

You may also like

Leave a Comment