vrm media ఖమ్మం ప్రతినిధి

– ఎంపీజే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ మజీద్ షోయబ్ డిమాండ్
ఖమ్మం, డిసెంబర్ 24 :
జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా గత ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం అర్హులైన ఖమ్మం జర్నలిస్టులకు కేటాయించిన 23.02 ఎకరాల (రెండు కుంటలు) భూమిని ఎలాంటి నిర్లక్ష్యం, కాలయాపన లేకుండా తక్షణమే జర్నలిస్టులకు అప్పగించాలని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ మజీద్ షోయబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎంపీజే జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మం నగరానికి విచ్చేసిన అబ్దుల్ మజీద్ షోయబ్‌ను, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్ – హెచ్ -2843) జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి నేతృత్వంలో జర్నలిస్టు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్యను వినతి పత్రం ద్వారా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై స్పందించిన అబ్దుల్ మజీద్ షోయబ్ మాట్లాడుతూ, స్టేట్ పాలసీ పేరుతోనూ, సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ కావాలనే కాలయాపన చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అర్హులైన జర్నలిస్టులకు న్యాయంగా రావాల్సిన ఇళ్ల స్థలాల అప్పగింత జరిగే వరకు ఎంపీజే జర్నలిస్టుల పోరాటానికి పరోక్ష ఉద్యమ రూపంలో సంపూర్ణ మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు.
అనంతరం టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్- 2843) జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ,
సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ సంవత్సరాల తరబడి ఇళ్ల స్థలాలను జాప్యం చేయడం శోచనీయమని తీవ్రంగా విమర్శించారు. ఇళ్ల స్థలాల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యం కారణంగా జర్నలిస్టులు, వారి కుటుంబాలు తీవ్ర మానసిక, ఆర్థిక వేదనకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ మజీద్ షోయబ్, జర్నలిస్టుల డిమాండ్ పూర్తిగా న్యాయమైనదని, ఇళ్ల స్థలాల మంజూరుకు ఎంపీజే సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని మరోసారి భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి అరవపల్లి నగేష్, నాయకులు కప్పల మధు, ఎంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఖాసిమ్, జిల్లా కార్యదర్శి రజబాలి తదితరులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird