Home Uncategorized ఒంటిమిట్టలో ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా దుండగుల చొరబాటు

ఒంటిమిట్టలో ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా దుండగుల చొరబాటు

by VRM Media
0 comments

ఎంపీడీవో కార్యాలయం తర్వాత తహసిల్దార్ కార్యాలయంలోనూ చొరబాటు

సీసీ కెమెరాలు లేకపోవడం పోలీసులకు సవాల్

మందుబాబుల పనా? దొంగల పనా? ఇంటి దొంగల పనా?

VRM న్యూస్ బాల మౌలాలి జనవరి 7

ఒంటిమిట్ట :
ఒంటిమిట్ట మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా దొంగలు తెగబడటం కలకలం రేపుతోంది. మంగళవారం రాత్రి ఎంపీడీవో కార్యాలయంలో దొంగతనానికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు, అదే రాత్రి లేదా సమీప సమయంలో తహసిల్దార్ కార్యాలయంలోనూ చొరబాటుకు ప్రయత్నించారు.
మొదట ఎంపీడీవో కార్యాలయంలో రెండు గదుల తాళాలను పగులగొట్టి బీరువాలను తెరిచిన దుండగులు, అక్కడ నుంచి మరో ప్రభుత్వ కార్యాలయంపై దృష్టి సారించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ప్రస్తుతానికి ఎంపీడీవో కార్యాలయంలో ఏ వస్తువులు లేదా నగదు మాయమైనట్లు నిర్ధారణ కాలేదు. దస్త్రాలు ఏమైనా మాయమయ్యాయా అనే అంశంపై అధికారులు ఇంకా లెక్కలు పరిశీలిస్తున్నారు.
దస్త్రాలే లక్ష్యమా? అన్న అనుమానాలు
ఈ ఘటనలో కీలకమైన ప్రభుత్వ దస్త్రాలు ఏమైనా మాయమయ్యాయా? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బీరువా లోని కొన్ని ఫైళ్లను చెల్లాచెదురుగా పడేసిన ఆనవాళ్లు కనిపించడంతో అధికారులు దస్త్రాల లెక్కలు పరిశీలిస్తున్నారు. పూర్తి తనిఖీ తర్వాతే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తాళం లేని తలుపే ప్రవేశ మార్గం
ఎంపీడీవో కార్యాలయ ఉత్తర వైపున ఉన్న ఒక డోర్‌కు తాళం వేయకపోవడంతో అదే మార్గంగా దుండగులు లోపలికి ప్రవేశించినట్లు ప్రాథమిక అంచనా. భద్రతా లోపాలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సీసీ కెమెరాలు లేవు – దర్యాప్తుకు అడ్డంకి
ఎంపీడీవో కార్యాలయంలో సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల దుండగుల కదలికలపై ప్రత్యక్ష ఆధారాలు లభించక, ఇది పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. దర్యాప్తు పూర్తిగా పరోక్ష సమాచారం, అనుమానాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మూడు కోణాల్లో పోలీసుల దర్యాప్తు
ఈ వరుస ఘటనలపై పోలీసులు మూడు కోణాల్లో విచారణ చేపట్టారు. రాత్రివేళ మద్యం సేవించి చేసిన మందుబాబుల అల్లరా? ముందస్తు సమాచారం తో వచ్చిన పక్కా దొంగల పనా? కార్యాలయ వ్యవహారాలపై అవగాహన ఉన్న ఇంటి దొంగల ప్రమేయమా? అన్న అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు.
తహసిల్దార్ కార్యాలయంలోనూ దొంగతనం
ఒంటిమిట్ట తహసిల్దార్ కార్యాలయంలో కూడా దొంగల చొరబాటు కలకలం రేపింది. కార్యాలయంలోని బాత్రూం వెనుక భాగంలో ఉన్న వెంటిలేటర్‌కు అమర్చిన అద్దాలను తొలగించిన దుండగులు, అదే మార్గంగా లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లోపలికి ప్రవేశించిన వ్యక్తికి గాయాలైనట్లు సమాచారం. బాత్రూంలో రక్తపు మరకలు స్పష్టంగా కనిపించడంతో దొంగలకు గాయాలు తగిలినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇది దర్యాప్తులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే సిఐ నరసింహారాజు, ఎస్ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సమగ్ర విచారణకు శ్రీకారం చుట్టారు. రక్తపు మరకల ఆధారంగా దుండగుల ఆచూకీ గుర్తించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. క్లూస్ టీం ను రంగంలోకి దించారు.
ప్రజల్లో భయాందోళన
ఒకే రాత్రిలో లేదా సమీప సమయంలో రెండు ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగతనాలకు ప్రయత్నం జరగడం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ప్రభుత్వ కార్యాలయాలకే భద్రత లేకపోతే తమ ఇళ్లు, దుకాణాల పరిస్థితి ఏమిటన్న భయం వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాత్రి గస్తీని పటిష్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

2,807 Views

You may also like

Leave a Comment