— టిడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి
ఖమ్మం, జనవరి 10:
జర్నలిస్టుల గౌరవం,హక్కులు,సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన సీనియర్ పాత్రికేయుడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యులు టీ.కే. లక్ష్మణ రావు సంస్మరణ సభను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్ – హెచ్-2843) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంతోటి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.సభ ప్రారంభంలో లక్ష్మణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, ఆయన ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు టి.సంతోష్ చక్రవర్తి, కార్యదర్శి నానబాల రామకృష్ణ లు మాట్లాడుతూ, లక్ష్మణ రావు మృతి జర్నలిస్టు సమాజానికి తీరని లోటని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన పోరాట పటిమ టిడబ్ల్యూజేఎఫ్కు ఎప్పటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.ఉదయం, వార్త, సాక్షి వంటి ప్రధాన పత్రికల్లో పనిచేసిన సీనియర్ పాత్రికేయుడిగా లక్ష్మణ రావు చిన్న–పెద్ద తేడా లేకుండా అందరితో స్నేహంగా మెలిగేవారని వక్తలు గుర్తు చేశారు.తెలుగు భాషపై అపారమైన పట్టు, వృత్తిలో ఎంత ఒత్తిడి ఉన్నా చిరునవ్వుతో వ్యవహరించే వ్యక్తిత్వం ఆయన ప్రత్యేకతలని కొనియాడారు.జర్నలిస్ట్స్ ఫెడరేషన్ స్థాపనలో ఆయన పోషించిన పాత్ర రాబోయే తరం జర్నలిస్టులకు ఆదర్శమని తెలిపారు.ఈ సంతాపసభలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కుంభం రవికుమార్, టీబీజేఏ జిల్లా అధ్యక్షుడు వందనపు సామ్రాట్ గుప్తా, వీడియో గ్రాఫర్స్ జిల్లా అధ్యక్షుడు అమరబోయిన ఉపేందర్, జిల్లా కోశాధికారి అర్వపల్లి నగేష్, టిడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్షుడు గంటెల కుమార్,టీబీజేఏ నగర అధ్యక్షుడు ఎలుగోటి వెంకట్, ప్రెస్ క్లబ్ కోశాధికారి కొదుమూరి భద్రయ్య, నగర కార్యవర్గ సభ్యుడు చిన్నంశెట్టి రాంబాబు తదితరులు పాల్గొని టీ.కే. లక్ష్మణ రావుకు ఘనంగా నివాళులర్పించారు.

