చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై లక్ష్మీకాంతం మరియు బృందాన్ని అభినందించిన – డి.ఎస్.పి శ్రీహరి రాజు
ప్రత్తిపాడు, Vrm media న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ జనవరి27:–
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారులో అక్రమంగా కల్తీ వంట నూనె తయారీ చేస్తున్న కేంద్రంపై ప్రత్తిపాడు పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సై లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో నకిలీ వంట నూనె తయారీలో పాల్పడుతున్న ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 15 నకిలీ ఆయిల్ డబ్బాలు, తయారీకి ఉపయోగిస్తున్న 4 క్రూడ్ ఆయిల్ డబ్బాలు, అలాగే కల్తీ నూనె తయారీలో వినియోగిస్తున్న పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పి శ్రీహరి రాజు మాట్లాడుతూ, అక్రమ ధనార్జనే లక్ష్యంగా ఎఫ్.కె. పాలెం గ్రామానికి చెందిన బండారు ఫణి ప్రసాద్ ధర్మవరం శివారులో జంతువుల కొవ్వు, క్రూడ్ ఆయిల్ కలిపి మరగబెట్టి కల్తీ వంట నూనె తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నకిలీ నూనెను ఇచ్చాపురానికి చెందిన వెంకటేశ్వర ట్రేడర్స్ యజమాని సంతోషి శ్రీనివాస్ దాస్, రాజమండ్రికి చెందిన ఎం.డి. ఇఫ్రాన్‌లతో ఒప్పందం కుదుర్చుకొని గత నాలుగు నెలలుగా వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ అక్రమ దందాలో నిందితుడితో పాటు మరో ఎనిమిది మంది పాల్గొంటున్నారని, వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని డిఎస్పి తెలిపారు. ప్రధాన నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నట్లు స్పష్టం చేశారు.ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు సూచనలతో అక్రమ కల్తీ వ్యాపారాన్ని చాకచక్యంగా గుర్తించి పట్టుకున్న ఎస్సై లక్ష్మీకాంతం మరియు సిబ్బందిని డిఎస్పి శ్రీహరి రాజు అభినందించారు. ప్రజలు నకిలీ, కల్తీ పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
