Home Uncategorized ప్రజలకు లబ్ది చేకూరేలా కేంద్ర ప్రాయోజిత పథకాలను పకడ్బందీగా జిల్లాలో అమలు చేయాలి….. పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి

ప్రజలకు లబ్ది చేకూరేలా కేంద్ర ప్రాయోజిత పథకాలను పకడ్బందీగా జిల్లాలో అమలు చేయాలి….. పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి

by VRM Media
0 comments

Vrm media ప్రతినిధి

*కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి

*10 వేల ఇందిరమ్మ ఇళ్లకు స్లాబింగ్ పూర్తి

*ఖమ్మం జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షించిన ఎంపి, జిల్లా కలెక్టర్

ఖమ్మం, ఫిబ్రవరి -27:

ప్రజలకు లబ్ది చేకూరేలా కేంద్ర ప్రాయోజిత పథకాలను జిల్లాలో పూర్తి స్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలనీ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో పార్లమెంట్ సభ్యులు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, రాందాస్ నాయక్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ లతో కలిసి పాల్గొన్నారు.

దిశ సమావేశంలో ప్రస్తుతం వారి శాఖల పరిధిలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై జిల్లా సంక్షేమ అధికారి, జీఏం పరిశ్రమలు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, మున్సిపల్ కమీషనర్ లు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, పీ.డీ జాతీయ రహదారులు, పి.డి. హౌసింగ్, విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ అధికారులు నివేదికలు వివరించారు.

పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా వచ్చిన వికసిత్ భారత్ జి రామ్ జి పథకం మార్గదర్శకాలు ప్రతి ప్రజా ప్రతినిధికి అందేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను రెగ్యులర్ గా మానిటర్ చేయాలని అన్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నడిచే వివిధ వైద్య సేవలలో ఉన్న ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీకి చర్యలు తీసుకోవాలని, ఖమ్మం ఆసుపత్రి మరమ్మత్తు, క్రిటికల్ కేర్ బ్లాక్, ఇతర మౌళిక వసతుల పనుల పురోగతి వివరాలు అందించాలని అన్నారు.

జిల్లాలో ప్రైవెట్ ఆసుపత్రిలో అధికంగా సి సెక్షన్ ఆపరేషన్స్ జరుగుతున్నాయని, దీని పై కలెక్టర్ రివ్యూ నిర్వహించాలని అన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి పనులపై రిపోర్ట్ అందించాలని, సంబంధిత మంత్రితో సమావేశమయి నూతనంగా నిర్మించిన ఎన్ హెచ్ త్వరగా ఓపెన్ అయ్యేలా చూస్తామని అన్నారు.

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలోని ఐటిఐ, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించామని అన్నారు. జిల్లా లో ఉన్న సెంట్రల్ టూల్ డిజైన్ సెంటర్ కు కేంద్రం నుంచి నిధులు సాధించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రాబోయే రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలు రవాణా కోసం వినియోగించే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్నం భోజన నాణ్యతను జిల్లా అధికారులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామని, 45 లక్షల రూపాయలతో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని అన్నారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో 3 వారాల వ్యవధిలో చెరువు పక్కన వేస్తున్న డంప్ తొలగించాలని, రోడ్డు పక్కన చెత్త డంప్ చేయరాదని అన్నారు.

జిల్లాలో పోడు పట్టాలలో బోర్లు వేసుకునేందుకు కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వీటిని పరిశీలించి పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అవసరమైన వసతుల అంశాలకు సంబంధించి తయారు చేసిన సంక్షిప్త నివేదిక ప్రజాప్రతినిధులకు అందించాలని, వీటిని ప్రభుత్వం ద్వారా మంజూరు అయ్యేలా ప్రజాప్రతినిధులు తమ వంతు ప్రయత్నం చేయాలని కలెక్టర్ కోరారు.

జిల్లాలో 9 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు హెచ్.పి.వి. వ్యాక్సినేషన్ చేపట్టేందుకు పటిష్ట కార్యాచరణ చేపట్టామని, దీని వల్ల మహిళల్లో సర్వైవల్ క్యాన్సర్ రాకుండా చేయవచ్చని తెలిపారు. ఆర్.ఓ.బీ పనులు, టోల్ టెండరింగ్ పనులు సమాంతరంగా జరగాలని అన్నారు. మార్చి 20 నాటికి జిల్లాలో అత్యధికంగా ప్రమాదాలు జరిగే 30 జంక్షన్ లలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ కు అవసరమైన చర్యలు పూర్తి చేస్తామని తెలిపారు.

జాతీయ రహదారులకు సంబంధించి భూ సేకరణ చివరి దశకు చేరుకుందని, భూ సేకరణ అంశం కోర్టులో పెండింగ్ ఉన్న వాటిపై రైతులతో చర్చిస్తూ సమస్య పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 10 వేల ఇందిరమ్మ ఇండ్లు స్లాబ్ దశకు చేరుకున్నాయని, వీటిని 2 నెలల్లో పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేసేలా పనిచేస్తున్నామని అన్నారు.

ధంసలాపురం వద్ద అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్దిదారులకు కేటాయించి పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. వైరా పట్టణ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనువైన స్థలం కేటాయింపుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

*ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ జి రాంజీ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ కూలీలకు పని వేళలు ఏమైనా తగ్గాయా స్టడీ చేసి రిపోర్ట్ అందించాలని కోరారు.

జిల్లాలో మంజూరు అయిన ఉపాధి హామీ పనులు, వాటి పురోగతి మనకు ఇంకా రావాల్సిన పెండింగ్ బకాయిల అంశం ఎప్పటి కప్పుడు ఫాలో అప్ చేయాలని అన్నారు. విద్యాశాఖ పరిధిలో అనేమియా బారిన పడే పిల్లలను గుర్తించి అవసరమైన పోషకాహారం అందేలా చూడాలని అన్నారు. ఆసుపత్రులలో సి సెక్షన్ డెలివరీ తక్కువ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం దేవరపల్లి ఎన్.హెచ్ ఎప్పటి వరకు ఓపెనింగ్ అవుతుందో చెప్పాలని, ఎన్.హెచ్ ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

*వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు పొందిన రైతులు బోర్లు వేసేందుకు, కరెంట్ పెట్టుకునేందుకు ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు కొంత మందికి నిర్మాణం మధ్యలో ఎల్ 1 నుంచి ఎల్ 3 మార్చడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని, మొదటి దశలో మంజూరు చేసిన ఇండ్లు వర్షాకాలం రాకముందే పూర్తయ్యే విధంగా కృషి చేయాలని కోరారు.

*సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ సత్తుపల్లి ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్స్ డిప్యూటేషన్ పై మరో చోట పని చేయడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. సత్తుపల్లి ఆసుపత్రికి కేటాయించిన అంబులెన్స్ డ్రైవర్ పోస్ట్ శాంక్షన్ చేయాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ సమస్యల కారణంగా త్రాగునీటి ఇబ్బంది గ్రామాలలో ఉందని, వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో జెడ్పీ సి.ఈ.ఓ. దీక్షా రైనా, మున్సిపల్ చైర్ పర్సన్లు, సర్పంచులు, జిల్లా అధికారులు, దిశ కమిటీ సభ్యులు, మునిసిపల్ కమీషనర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.

2,803 Views

You may also like

Leave a Comment