*ఇప్పటివరకు సర్వేలో ఖమ్మం జిల్లాకు చెందినవారు 522, ఇతర జిల్లాలకు చెందినవారు 107, ఇతర రాష్ట్రాలకు చెందినవారు 3
అర్హులైన పేదలకు ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
సంబంధించిన వ్యక్తులు సర్వేకు సహకరించాలి
ఖమ్మం, ఫిబ్రవరి- 28:
ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో ఫిబ్రవరి 24న భూదాన్ భూములలో చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఇండ్లు కోల్పోయిన వ్యక్తుల సామాజిక, ఆర్థిక సర్వే ముమ్మరంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని 21 మంది తహశీల్దార్లకు సంబంధిత వ్యక్తుల సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టి, యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేయగా, ఇప్పటి వరకు ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన 182 మంది, ఖమ్మం జిల్లాలోని ఇతర మండలాలకు చెందిన వారు 340 మంది ఉన్నారని, అలాగే రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందినవారు 107 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ముగ్గురు ఉన్నట్లు తెలిపారు.
సర్వే ప్రక్రియ కొనసాగుతుందని, యుద్ధప్రాతిపదికన పూర్తికి చర్యలు చేపట్టినట్లు, పూర్తి అయిన తర్వాత అర్హులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం నివాస స్థల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుకు చర్యలు చేపడతామన్నారు.
సర్వే కు సంబంధించిన వ్యక్తులు, వారి వారి గ్రామాల్లో అందుబాటులో ఉండి, సామాజిక, ఆర్థిక సర్వేకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.

