

రెండు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు(ఫిబ్రవరి 17) తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ ఉంది. (నటి ప్రత్యూష)
భువనగిరికి చెందిన ప్రత్యూష చిన్న వయసులోనే స్టార్‌డం చూశారు. 1998లో ‘రాయుడు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రత్యూష.. తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కేవలం 20 ఏళ్ల వయసులోనే.. 2002 ఫిబ్రవరి 24న ప్రత్యూష చనిపోయారన్న వార్త సినీ ప్రపంచాన్ని, ప్రేక్షకులను కుదిపేసింది.
ప్రత్యూష, ఆమె స్నేహితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం విషం తాగి ఆసుపత్రి పాలయ్యారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న ప్రత్యూష మరణించారు.. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ డిశ్చార్చి అయ్యాడు.
ప్రత్యూష మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమెది హత్య అని, ఆమెపై దాడి జరిగింది, దీని వెనుక ఓ రాజకీయ నాయకుడి కుటుంబ సభ్యుడు ఉన్నాడని.. ఇలా ఎన్నో ప్రచారాలు జరిగాయి. ప్రత్యూషది హత్యేనని ఆరోపిస్తూ ఆమె తల్లి సరోజినీదేవి న్యాయ పోరాటానికి దిగారు.
ఈ కేసులో దర్యాప్తు జరిపిన సీబీఐ.. ఆత్మహత్య అని తేల్చింది. నిందితుడు సిద్ధార్థపై సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), సెక్షన్ 309 (ఆత్మహత్యకు యత్నించడం) కింద సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సిద్ధార్థకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి.. ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు, రూ.5 వేల జరిమాన విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చారు.
ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ హైకోర్టును ఆశ్రయించాడు. జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ.. 2011 డిసెంబర్ 28న హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే అటు సిద్ధార్థ, ఇటు సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి, హైకోర్టు విధించిన శిక్షను పూర్తిగా రద్దు చేయాలంటూ సిద్ధార్థ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లపై 2025లో వాదనలు పూర్తయ్యాయి. జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబర్‌లో తీర్పును రిజర్వ్ చేసింది.
ప్రత్యూష మరణించిన 24 ఏళ్ళ తరువాత తుది తీర్పు రాబోతుంది. ప్రత్యూషది హత్యా? ఆత్మహత్యా? సుప్రీంకోర్టు తీర్పు ఏంటి? అనేది మరికొద్ది సేపట్లో తేలిపోనుంది.