
గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. అల్లు శిరీష్ వెడ్డింగ్ కార్డు అందుకున్న సమయంలో చిరు చేతికి ఆర్మ్ స్లింగ్ ఉండటం చూసి తమ హీరోకి ఏమైంది అంటూ అభిమానులు ఆసక్తిగా ఆరా తియ్యడం మొదలు పెట్టారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తన ఆరోగ్యం గురించి ఒక ప్రకటన చేశారు.
‘చేతికి పట్టీ పెట్టారు కాబట్టి అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు నాకు ఏమైందని ఆరా తియ్యడం మొదలు పెట్టారు. అందుకే దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తున్నాను. నా భుజానికి చిన్న కీ-హోల్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం నేను బాగానే కోలుకుంటున్నాను. నా దినచర్య సజావుగా సాగుతోంది. అత్యుత్తమ ఆర్థోస్కోపీ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నితిన్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సర్జరీ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, ఆయన నైపుణ్యంతో ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగింది. మీ అందరి ప్రేమ, అభిమానం, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు” అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు మెగాస్టార్ చిరంజీవి.