vrm media ప్రతినిధి



మార్చి 1–5 వరకు భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు
కోమట్లగూడెం, మార్చి 01
ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ అంకమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు మార్చి 1 నుండి 5 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు.
గత 28 సంవత్సరాలుగా సంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఈ మహోత్సవాలు ప్రాంతీయ ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామం మొత్తం ఉత్సవ శోభతో కళకళలాడనుంది.
మహోత్సవాల తొలి రోజు మహాభిషేకం, ప్రత్యేక పూజలు, స్వామివారి ఊరేగింపు నిర్వహించబడతాయి. మార్చి 2న ఉదయం తీర్థప్రసాదం, అనంతరం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం స్వామివారి కళ్యాణం ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, ప్రసాదం, పార్కింగ్ వంటి ఏర్పాట్లు చేపట్టినట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు.
మార్చి 3న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పాటల పోటీలు నిర్వహించబడతాయి. మార్చి 5న “డాన్స్ బేబీ డాన్స్” పోటీలు జరగనున్నాయి. పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేయబడతాయి. పోటీల నిర్వహణకు అవులూరి రామిరెడ్డి, రాయల శ్రీను, వేముల జానకిరాములు సమన్వయ బాధ్యతలు చేపట్టారు.
జాతర ప్రారంభోత్సవాన్ని చింతకాని సబ్ ఇన్స్పెక్టర్
ఎన్.వీరేందర్ ప్రారంభించనున్నారు. మహోత్సవాల నిర్వహణలో దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు చురుకుగా పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని
వారు విజ్ఞప్తి చేశారు.