

- సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కొరియన్ రొమాంటిక్ డ్రామా
- ఫ్రెండ్ తమ్ముడితో 35 ఏళ్ళ మహిళ లవ్ స్టోరీ
కొరియన్ సిరీస్ లకు తెలుగులోనూ మంచి ఆదరణ ఉంటుంది. పలు సిరీస్ లు రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా కొరియన్ రొమాంటిక్ డ్రామాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఓ రొమాంటిక్ డ్రామా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
2018 లో వచ్చిన కొరియన్ సిరీస్ ‘సంథింగ్ ఇన్ ది రెయిన్'(వర్షంలో ఏదో). సన్ యే-జిన్, జంగ్ హే-ఇన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ కి.. అహ్న్ పాన్-సియోక్ దర్శకత్వం వహించారు. 35 ఏళ్ల వయసున్న ఓ మహిళ, తనకంటే ఆరేళ్ళు చిన్నవాడైన స్నేహితురాలి తమ్ముడితో ప్రేమలో పడితే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే కోణంలో ఈ సిరీస్ నడుస్తుంది. ఓటీటీ వేదికలు నెట్ ఫ్లిక్స్, ఎంక్స్ ప్లేయర్లలో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

కథ ఏంటంటే..
జిన్-ఆహ్ అనే మహిళ ఓ కాఫీ హౌస్‌లో పనిచేస్తుంటుంది. అక్కడ మహిళలను చిన్నచూపు చూస్తారు. మహిళా ఉద్యోగులకు బాస్ నుంచి శస్త్రచికిత్స వేధింపులు కూడా ఎదురవుతాయి. 30 ఏళ్ళు దాటినా పెళ్లి కాకుండా, ఆఫీస్ లో బాస్ వేధింపులతో జీవితాన్ని నెట్టుకొస్తున్న జిన్-ఆహ్ జీవితంలోకి.. జూన్-హుయి అనే యువకుడు వస్తాడు. అతను ఎవరో కాదు.. ఆమె ఫ్రెండ్ తమ్ముడే.
వీడియో గేమ్ డెవలపర్ గా పని చేసే అతను.. విదేశాల నుంచి తిరిగి వస్తాడు. మొదట్లో అతన్ని ఓ తమ్ముడు లాగానే చూస్తుంది. క్రమంగా ఇద్దరి మధ్య చనువు పెరుగుతుంది. ముఖ్యంగా ఓ రోజు వర్షంలో గొడుగు కింద నడుస్తున్నప్పుడు ఇద్దరూ బాగా దగ్గరవుతారు. అప్పటినుంచి ముద్దు ముచ్చట్లతో సీక్రెట్ గా లవ్ ట్రాక్ నడిపిస్తారు. అయితే ఈ విషయం ఇంట్లో తెలుస్తుంది. వయస్సు తేడా వల్ల వారి ప్రేమ కథకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అలాగే ఆఫీస్ లో వేధిస్తున్న బాస్ కి ‘జిన్-ఆహ్’ బుద్ధి చెప్పిందా? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
మంచి లవ్ స్టోరీతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపిన ఈ సిరీస్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఐఎండీబీలో ఈ సిరీస్‌కి 8 రేటింగ్ ఉంది.
ఇది కూడా చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘పెన్నుమ్ పోరాట్టమ్’