
తెలంగాణ
ఓయ్-కొరివి జయకుమార్
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలగజేస్తున్నాయి. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడ ఉన్న సిద్ధి వినాయక క్లాత్ షోరూమ్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో షోరూమ్ అంత వేగంగా వ్యాపించాయి. దుకాణంలో నిల్వ ఉంచిన భారీ మొత్తంలో బట్టలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. మంటలు ఎగిసిపడడంతో సమీప ప్రాంతాల భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పలు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకున్నారు. గంటల పాటు శ్రమించి అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా నియంత్రించారు. ఈ ఘటనలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం సమయంలో షోరూమ్‌లో ఉద్యోగులు లేదా కస్టమర్లు లేనందున పెద్ద ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇక కొన్ని నెలల ముందే జగిత్యాల ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు వరుసగా ఉన్న బొమ్మల దుకాణాలు మంటల్లో దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి సుమారు 11 గంటల సమయంలో బొమ్మల దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు వేగంగా వ్యాపించడంతో మొత్తం 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనితో కోట్లాది రూపాయల విలువైన సామగ్రి తగలబడిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.