*VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం
రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు అన్నారు. బుధవారం కోరుకొండ మండలం కోటి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ కీలక అంశాలను ప్రస్తావించారు:
రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ అయ్యేలా పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. ధాన్యం నాణ్యత పరిశీలనలో రైతులకు అన్యాయం జరగకూడదని, తేమ శాతం విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి సకాలంలో కొనుగోలు ప్రక్రియను చేపట్టి రైతులకు అండగా నిలుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు,మండల స్థాయి అధికారులు, పౌరసరఫరాల శాఖ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు, జనసేన, తెలుగుదేశం, బిజెపి కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు.


