
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
తిరుమలలో భక్తుల ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు టీటీడీ పెద్ద పీట వేస్తోంది. సగటున రోజుకు 80,000 నుండి లక్ష మంది సందర్శిస్తున్న నేపథ్యంలో సుమారు 4.5 చదరపు కిలోమీటర్ల పరిధిలోని పారిశుద్ధ్య నిర్వహణ పనులు సమర్థంగా కొనసాగుతున్నాయి. తిరుమలను మూడు జోన్లుగా, ఏడు వార్డులుగా విభజించింది. దీని ఆధారంగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తోంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ లను నియంత్రించి నో స్టాక్- నో గోడౌన్ లైసెన్సులను జారీ చేస్తోంది. వార్డు 1లో శ్రీవారి ఆలయంలో భాగంగా విభాగ సిబ్బంది ప్రత్యక్షంగా పనిచేస్తారు, వార్డు-2 నుండి 7 వరకు పారిశుద్ధ్య మూడు కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించబడింది. తిరుమలలో చెత్త సేకరణకు తొమ్మిది టిప్పర్లు పనిచేస్తున్నాయి.

రోజుకు సుమారు 45 ట్రిప్పుల మేర సుమారు 3,056 బిన్స్ నుండి చెత్త సేకరణ జరుగుతోంది. అన్ని వాహనాలు కలిపి రోజుకు సుమారు 400 మేర ప్రయాణిస్తున్నాయి. గత ఏడాది 16,689.04 మెట్రిక్ టన్నుల బయోడిగ్రేడబుల్, 8,221.97 మెట్రిక్ టన్నుల నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వార్డు వారిగా విస్తృతంగా మరుగుదొడ్ల బ్లాకులు ఏర్పాటు చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో మొబైల్ వాటర్ డ్రమ్స్ ద్వారా శ్రీవారి సేవకులతో తాగునీరు పంపిణీ చేస్తోంది టీటీడీ. 1981లో టీటీడీ ఏర్పాటు చేసిన వాటర్ అండ్ పుడ్ అనాలసిస్ లియాబొరేటరీ ద్వారా నీరు, ఆహారం నాణ్యతను పరీక్షిస్తున్నారు. దీనికి అదనంగా ఇటీవల కొత్తగా అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు చేయబడింది. తిరుమలలో టీటీడీ ఆరోగ్య విభాగం అందించే నాణ్యమైన పారిశుద్ధ్య సేవపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాజా చెత్తను సేకరించడం, మరుగుదొడ్లను నిత్యం పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యల పట్ల భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తోందని టీటీడీ చెబుతోంది. తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని, తిరుమలలో పారిశుద్ధ్య, చెత్త నిర్వహణ, మరుగుదొడ్ల సౌకర్యాలు, ఆహార భద్రతను అత్యంత పటిష్టంగా నిర్వహిస్తున్నామని, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి, భక్తులకు స్వచ్ఛమైన, వాతావరణంలో ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.