
తెలంగాణ
ఓయ్-జక్కీ మహేష్
వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన గర్భిణీ స్త్రీ, ఆమె ఇద్దరు కుమార్తెల ట్రిపుల్ మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేవలం మగపిల్లాడు కలగలేదన్న కారణంతో మరో వివాహం చేసుకోవాలంటే దురాలోచనతో కన్నబిడ్డలను, కట్టుకున్న భార్యను పొట్టనబెట్టుకున్న కిరాతకుడు అజరుద్దీన్‌తో పాటు మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
లింగ నిర్ధారణ పరీక్షలు.. అబార్షన్ కుట్ర
వరంగల్ పోలీస్ కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు మహ్మద్ అజారుద్దీన్ భార్య ఫర్హత్ మూడోసారి గర్భం దాల్చింది. ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉండటంతో మూడోసారి కూడా అమ్మాయే పుడుతుందనే అనుమానంతో అజరుద్దీన్ అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఇందుకు కొందరు డాక్టర్లు, లియాబ్ టెక్నీషియన్లు, మెడికల్ షాప్ యజమాని అతడికి సహకరించారు. స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేయాలని ప్రయత్నించారు. ఈ నిబంధనలకు విరుద్ధంగా వైద్య సిబ్బందిపై కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

మరో పెళ్లి కోసం కిరాతక ప్లాన్
ఈ కేసు విచారణలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అజారుద్దీన్ ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లి ప్రతిపాదన పెట్టాడు. అయితే అతనికి ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని.. భార్య మళ్లీ గర్భిణి అని తెలిసి ఆ బాలిక తల్లిదండ్రులు తిరస్కరించారు. వారితో పెళ్లికి అడ్డంకిగా ఉన్నారని భావించిన అజరుద్దీన్.. తన భార్యను, ఇద్దరు కూతుళ్లను అంతం చేసాడు. తన ఫామ్‌హౌస్‌లో ముందస్తుగా సీసీటీవీ కెమెరాలను డిస్‌కనెక్ట్ చేసి, పవర్ సప్లై నిలిపివేసి పక్కా స్కెచ్ వేశాడు.
స్విమ్మింగ్ ఫూల్‌లో నెత్తి దారుణ హత్య
ఏప్రిల్ 1వ తేదీన తన కుమార్తె పుట్టినరోజు వేడుకలు జరిగాయి.. భార్యను, ఇద్దరు కూతుళ్లను ఫామ్‌హౌస్‌లోని స్విమ్మింగ్ పూల్ దగ్గరకు తీసుకెళ్లారు. వారందరినీ నీటిలోకి నెత్తి వారు చనిపోయే వరకు నీళ్లలో అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత అది ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే బాధితురాలి తండ్రి అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అజారుద్దీన్ విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.
వైద్యులు సహా పది మంది అరెస్ట్
ఈ కేసులో ప్రధాన నిందితుడు అజరుద్దీన్‌తో పాటు అతనికి సహకరించిన కుటుంబ సభ్యులు, ఒక డాక్టర్, లియాబ్ టెక్నీషియన్, మెడికల్ షాప్ యజమాని సహా మొత్తం 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ఇద్దరు మహిళా డాక్టర్లు.. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడిపై హత్య కేసుతో పాటు మైనర్ బాలికను వేధించినందుకు పోక్సో చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు కమిషనర్. ఈ కిరాతక ఘటన వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం రేపింది.