VRM మీడియా అయినవిల్లి భద్రం
ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ స్పష్టం చేశారు. శనివారం రాజానగరం మండలం పాలచర్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పనితీరును, రోగులకు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు అక్కడ నిర్వహిస్తున్న “ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తనిఖీలో భాగంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలోని రిజిస్టర్లను, వైద్యులు మరియు సిబ్బంది హాజరు పట్టికను నిశితంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధులకు గైర్హాజరైనా లేదా సమయపాలన పాటించకపోయినా సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే సామాన్యులకు వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, బాధ్యతాయుతంగా సేవలందించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో స్వయంగా మాట్లాడి, వైద్యుల లభ్యత, మందుల పంపిణీ మరియు సిబ్బంది ప్రవర్తన గురించి అడిగి తెలుసుకున్నారు. ‘ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్’ గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గర్భిణీలకు రక్తహీనత, బీపీ, షుగర్ వంటి పరీక్షలు సకాలంలో నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. హై-రిస్క్ గర్భవతులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, తల్లీబిడ్డల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేయాలని వైద్యులకు సూచించారు. పౌష్టికాహారంపై గర్భిణీలకు అవగాహన కల్పించాలని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు దిశానిర్దేశం చేశారు.
స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు, ఇంజెక్షన్లు నిరంతరం అందుబాటులో ఉండాలని ఫార్మసిస్ట్‌ను ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణం, వార్డులు అత్యంత పరిశుభ్రంగా ఉండాలని, రోగులకు తాగునీరు, వేచి ఉండే గదులు వంటి కనీస వసతులలో ఎటువంటి లోటు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జనసేన, తెలుగుదేశం (TDP), మరియు భారతీయ జనతా పార్టీ (BJP) ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు
