ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితో ఫలించిన గ్రామ ప్రజల పోరాటం
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డికి, రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్రాజు, డీఈఓ షంషుద్దీన్‌కు గ్రామస్తుల పాలాభిషేకం
ఒంటిమిట్ట, ప్రతినిధి:VRM న్యూస్ బాల మౌలాలి
ఎన్నో రోజులుగా గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న శుభవార్త చిన్నకొత్తపల్లికి చేరింది. పాఠశాలల హేతుబద్ధీకరణలో భాగంగా ప్రాథమిక పాఠశాలగా మారిన చిన్నకొత్తపల్లి పాఠశాలకు తిరిగి 6, 7 , 8తరగతుల నిర్వహణకు విద్యాశాఖ అనుమతి మంజూరు చేసినట్లు సమాచారంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అదనపు తరగతుల రాకతో ఇద్దరు అదనపు టీచర్లు పాఠశాలకు రానున్నారు. విద్యార్థుల సంఖ్య అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగా పెరిగితే అదనంగా మరో ఇద్దరు వచ్చే అవకాశం ఉంది.
గత ఏడాది పాఠశాల హోదా మార్పుతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామంలోనే ఉన్నత తరగతుల విద్య అందుబాటులో లేకపోవడం వల్ల చిన్నారులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అనేకసార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో పాటు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు.
దగ్గరుండి పర్యవేక్షించిన ఎమ్మెల్సీ, ఇన్చార్జి
ఈ అంశాన్ని ప్రజాప్రతినిధుల స్థాయిలో ముందుకు తీసుకెళ్లడంలో ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి విశేషంగా కృషి చేసినట్లు తెలుస్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారి మరియు జిల్లా కలెక్టర్లతో నిరంతర సంప్రదింపులు జరిపారు. విజయవాడ స్థాయిలో సంబంధిత ఉన్నత అధికారులతో నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేశారని గ్రామస్తులు పేర్కొన్నారు.
అలాగే రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు కూడా పాఠశాల అప్‌గ్రేడ్ అంశాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ అధికారులతో సంప్రదింపులు జరిపారని గ్రామస్తులు తెలిపారు. గ్రామీణ విద్యాభివృద్ధికి ఆయన చూపిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు.
డీఈఓ చొరవతో పరిష్కారం
ఈ సమస్య పరిష్కారంలో జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ కీలక పాత్ర పోషించినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. గతంలో గ్రామానికి వచ్చి ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఆయన ప్రత్యేక చొరవ చూపారని, అవసరమైన ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపించి ప్రక్రియ వేగవంతం చేశారని తెలిపారు. పరిపాలనా పరమైన అడ్డంకులను అధిగమిస్తూ పాఠశాలకు మళ్లీ 6, 7 , 8తరగతుల అనుమతి వచ్చేలా కృషి చేశారని గ్రామస్తులు కొనియాడుతున్నారు.
బొబ్బిలి రాయుడు నిరంతర ప్రయత్నాలు
చిన్నకొత్తపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొబ్బిలి రాయుడు ఈ అంశంలో మొదటి నుంచీ పట్టుదలతో వ్యవహరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామ ప్రజల ఆకాంక్షలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేయడం, పాఠశాల సమస్యపై నిరంతరం ఫాలోఅప్ చేయడం ద్వారా అనుమతి సాధించడంలో ప్రధాన పాత్ర పోషించారని పేర్కొన్నారు.
గ్రామ ప్రజల తరఫున పలుమార్లు అధికారులను కలుసుకుని సమస్య తీవ్రతను వివరించడం, పాఠశాల అవసరాన్ని నొక్కిచెప్పడం వల్లే సానుకూల నిర్ణయం వెలువడిందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.
గ్రామంలో హర్షాతిరేకాలు
6, 7, 8 తరగతుల అనుమతి వార్త వెలువడడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సౌకర్యాల పరిరక్షణకు ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందని, భవిష్యత్తులో పాఠశాల మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
కృతజ్ఞతల వెల్లువ - పాలాభిషేకం
పాఠశాలకు 6, 7,8 తరగతుల అనుమతి రావడంపై గ్రామస్తులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ , ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు,జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ తదితరులకు కృతజ్ఞతా పూర్వకముగా పాలాభిషేకం నిర్వహించారు. గ్రామ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్పందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మధు ,రాణి ,వెంకటేష్ ,శ్రీను ,తాళ్లపాక సుబ్బయ్య, నడిపెయ్య ,నాగజ్యోతి ,రెడ్డమ్మ అంగన్వాడి టీచర్ నిర్మల, సుభాషిని, మహాలక్ష్మి ,సుప్రజ, రాధమ్మ, రామసుబ్బమ్మ , లత ,సుధామణి, చైతన్య తదితరులు పాల్గొన్నారు


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird