
పాతికేళ్ల పార్టీ పేరంటానికి రండి..!
- ఇల్లెందులో వినూత్నంగా ఆహ్వానాలు
- ఆడపడుచులకు బొట్టి పెట్టి పిలుపులు
- ఎంపీ వద్దిరాజు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తదితరుల హాజరు
ఇల్లెందు, ఏప్రిల్, 15:
సన్నాయి మేళం సప్పుడు.. బాజా భజంత్రీల మోతలు.. వెంట నడిచిన మహిళా నేతలు.. కుంకుమ పూలు, కుంకుమ, గంధం, వాయినాలు.. ఇవన్నీ ఏ పెండ్లి కార్యానివో అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే..! ఈ హడావిడి ఎక్కడో తెలుసుకోవాలంటే.. ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే..!!
ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కు సన్నాహకంగా ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. మేళ, తాళాల నడుమ పార్టీ ముఖ్య నాయకుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి వరంగల్ సభకు ఆహ్వానించారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, తెలంగాణ ఉద్యమకారుడు దిండిగాల రాజేందర్ అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా నేతలు, కౌన్సిలర్లు వెంట నడిచారు. ఇల్లెందు మున్సిపాలిటీ 7 వార్డులో గల 2 నెంబర్ బస్తీలో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్తల కుటుంబాల్లో ముఖ్యులైన బజారు సత్యనారాయణ, ఎంఏ రవూఫ్, చాగర్ల సరళ, సామల రవితేజ ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి, కుటుంబ సభ్యులందరినీ వరంగల్ లో జరిగే రజతోత్సవ సభకు హాజరు కావాలని ఎంపీ వద్దిరాజు కోరారు. ఒక ప్రాంతీయ పార్టీ పాతికేళ్లుగా క్రియాశీలకంగా ప్రజల కోసం అంకితమై పని చేయడం చాలా అరుదు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ తర్వాత అంతటి ఘనత బీఆర్ఎస్ కే దక్కిందన్నారు. అందుకే.. బీఆర్ఎస్ పాతికేళ్ల సంబురం పండుగలా నిర్వహిస్తున్నామని వద్దిరాజు తెలిపారు. ఈ సభకు తాము ఊహించిన దానికంటే ఎక్కువ మంది కార్యకర్తలు తరలివస్తున్నారని చెప్పారు. ఈ సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని రవిచంద్ర కోరారు.

