Home ఎంటర్‌టెయిన్మెంట్ VanaVeera Review: వనవీర మూవీ రివ్యూ – VRM MEDIA

VanaVeera Review: వనవీర మూవీ రివ్యూ – VRM MEDIA

by VRM Media
0 comments
VanaVeera Review: వనవీర మూవీ రివ్యూ



తారాగణం: అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి, నందు, సత్య, శివాజీ రాజా, ఆమని, కోన వెంకట్ నిర్వహించారు.
సంగీతం: వివేక్ సాగర్
డీఓపీ: సుజాత సిద్ధార్థ్
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
రచన: విశ్వజిత్
దర్శకత్వం: అవినాష్ తిరువీధుల
నిర్మాతలు: అవినాష్ బుయాని, ఆలపాటి రాజా, అంకిత్ రెడ్డి
బ్యానర్: సిల్వర్ స్క్రీన్ సినిమాలు
విడుదల తేదీ: జనవరి 1, 2026

నూతన సంవత్సరం కానుకగా నందు హీరోగా నటించిన ‘సైక్‌ సిద్ధార్థ’ విడుదలైంది. అయితే ఇదే రోజు నందు విలన్ గా నటించిన ‘వనవీర’ కూడా విడుదల కావడం విశేషం. అవినాష్ తిరువీధుల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదట ‘వానర’గా ప్రచారం పొంది, కొన్ని కారణాల వల్ల ‘వనవీర’గా పేరు మార్చుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..? (వనవీర మూవీ రివ్యూ)

కథ:
వనపురానికి చెందిన మధ్య తరగతి యువకుడు రఘు(అవినాష్).. ఉన్నత చదువులు చదివినా ఊళ్ళో ఖాళీగా ఉంటాడు. అతనికి తన తండ్రి కొనిచ్చిన బైక్ అంటే ఎంతో ఇష్టం. అయితే ఓసారి దేవా(నందు) పొలిటికల్ ర్యాలీకి తప్పనిసరి పరిస్థితుల్లో అతని మనుషులకు బైక్ ఇవ్వాల్సి వస్తుంది రఘు. కానీ ఆ బైక్ వాళ్ళు తిరిగి ఇవ్వరు. తన బైక్ ని తిరిగి తెచ్చుకోవడం కోసం రఘు ఏం చేశాడు? దేవా పార్టీలో అతను ఎందుకు చేరాడు? తర్వాత దేవాకు పోటీగా తానే ఎమ్మెల్యే అభ్యర్థిని బరిలోకి దింపాల్సి వచ్చింది? అసలు రఘు బైక్ కోసమే చేస్తున్నాడా? మరేదైనా లక్ష్యం ఉందా? ఈ కథకి, రామాయణానికి సంబంధం ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
కమర్షియల్ కథలను కూడా పురాణాలతో ముడిపెట్టి సినిమాలు చేయడం ఈమధ్య ట్రెండ్‌గా మారింది. ‘వనవీర’ కూడా ఆ కోవలోకే వస్తుంది. కుల వివక్ష నేపథ్యంలో రూరల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ ఇది. దీనికి రామాయణంలోని వానరసేన కథను ముడిపెట్టాడు దర్శకుడు. అదే ఈ సినిమాకి కొత్తదనాన్ని తీసుకొచ్చింది.

ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెనుక హనుమంతుడు ఉంటాడు అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పడానికి ప్రయత్నించారు. మరి హీరో చేసిన ధర్మ యుద్ధం దేనికి? అతనిని హనుమంతుడు ఎలా నడిపించాడు? వంటి అంశాలతో సినిమా నడుస్తుంది.

వానరసేనకు హనుమంతుడు ఇచ్చే మాటతో సినిమా ఆసక్తికరంగా ఉంది కానీ.. ఫస్ట్ హాఫ్ అంతా అదే ఆసక్తి కొనసాగలేదు. కుల రాజకీయాలు, హీరో పాత్ర పరిచయం, అతని బైక్ ని దేవా తీసుకొని తిరిగి లేకపోవడం, బైక్ ని తెచ్చుకోవడం హీరో రాజకీయ పార్టీలో చేరి పనివాడిలా సేవలు చేయడం.. వంటి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా నడిచింది.

అసలు కథ సెకండాఫ్ లోనే ఉంటుంది. దేవాతో హీరోకి ఉన్న విరోధం ఏంటి? అతన్ని దెబ్బ కొట్టడానికి హీరో ఏం చేశాడు? అనేది సెకండాఫ్ లో చూపించారు. ఈ విధంగా వచ్చే మలుపులు మెప్పించాయి. అయితే దేవాని దెబ్బ కొట్టడానికి హీరో చేసే ప్రయత్నాలను ఇంకా బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. పతాక సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో సత్య క్యామియో నవ్వులు పూయిస్తుంది.

కథనం నెమ్మదిగా సాగడం ఈ సినిమా ప్రధాన సమస్య. అలాగే చాలా సీన్స్ లో కొత్తదనం లోపించింది. ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు.

హీరోగా, డైరెక్టర్ గా అవినాష్ తన ప్రతిభను కనబరిచాడు. విలన్ గా నందు మెప్పించాడు. సిమ్రాన్ చౌదరి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. శివాజీ రాజా, సత్య నిడివితో సంబంధం లేకుండా తమ మార్క్ చూపించారు.

చిన్న సినిమా అయినా సాంకేతికంగా బాగానే ఉంది. ఏఐని ఉపయోహించుకొని వానరసేన విజువల్స్ బాగా చూపించారు. వివేక్ సాగర్ సంగీతం నేపథ్యం సినిమాకి ప్లస్ అయింది. పాటలు తేలిపోయాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాతల విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్ గా..
తెలిసిన కథే అయినా.. రామాయణ గాథతో ముడిపెడుతూ కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా నడిచి.. సెకండ్ హాఫ్ లోని మలుపులు, కొన్ని నవ్వులు సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాయి.

నిరాకరణ: ఈ సమీక్షలో వ్యక్తీకరించబడిన వీక్షణలు సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయాలు మరియు సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. ఈ సమీక్షకు వ్యాఖ్యానించడానికి లేదా ప్రతిస్పందించడానికి ముందు వీక్షకుల విచక్షణతో సలహా ఇవ్వబడుతుంది.

2,811 Views

You may also like

Leave a Comment