
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధారణ రోజుల కంటే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. వారం రోజులుగా అసాధారణంగా భక్తులు శ్రీవారి చెంతకు చేరుకుంటున్నారు. దేవదేవుడిని దర్శించుకుంటున్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేలాది వస్తోండడంతో తిరుమల కిటకిటలాడుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అదనపు సౌకర్యాలను కల్పిస్తున్నారు.
భక్తుల ఎండలకు తీవ్రత నుంచి ఉపశమనం కల్పించేందుకు బాటగమ్మ సర్కిల్ నుండి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు చలువ పందిళ్లు వేశారు టీటీడీ అధికారులు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లోనూ ఈ ఫొటోలు అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీవారి ఆలయం పరిసరాలు, లడ్డూ కౌంటర్లు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్ల నిర్మాణం జరుగుతోంది.

నాలుగు మాడాల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ వేయడం ద్వారా భక్తులు నేల వేడి నుండి ఉపశమనం పొందేలా చర్యలు తీసుకున్నారు. బాట గంగమ్మ గుడి సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఏర్పాటు చేసిన క్యూలైన్లలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. టీటీడీ అన్న ప్రసాద విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకుల ద్వారా క్యూలైన్లలోని భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.
ఉదయం అల్పాహారంగా పాలు ఉప్మా, పొంగల్, మధ్యాహ్నం సాంబరనం, పులిహోర, టమోట రైస్, రాత్రి పాలు ఉప్మా, సాంబారన్నం భక్తులకు నిరంతరాయంగా అందిస్తోన్న. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు మొబైల్ వాటర్ డ్రమ్ములతో తాగునీరు పంపిణీ చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డులో క్యూలైన్ల వెంబడి ఒక మొబైల్ ఫాస్ట్ ఎయిడ్ సెంటరు అందుబాటులో ఉంచారు.
ఈ నెల 16 నుండీ రద్దీ పెరుగుతూ వస్తోంది. 20వ తేదీ వరకు 4,32,213 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవటం విశేషం. ఇందులో అత్యంత 16, 17 తేదీల్లో 90,000 పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అత్యధికంగా 18, 19, 20 తేదీల్లో 43,000 పైగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. దాదాపు 19 లక్షలకు పైగా భక్తులకు అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ అందించింది టీటీడీ.
తేదీ- దర్శనాలు- తలనీలాలు- అన్న ప్రసాదాలు
మే 16- 90,011- 39,083- 4,20,085
మే 17- 91,020- 35,193- 3,81,210
మే 18- 80,455- 43,309- 3,42,670
మే 19- 84,412- 43,032- 4,03,810
మే 20- 86,315- 44,107- 3,99,380