
తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. టాలీవుడ్‌లో పంపిణీదారుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గుజ్జలపూడి హరి (47) ఆదివారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఎంతో చురుగ్గా ఉంటూ ఇండస్ట్రీ వృద్ధిలో భాగస్వామి అయిన ఆయన ఇంత చిన్న వయసులోనే విడిచి వెళ్లడం చిత్రసీమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
నెల్లూరు జిల్లాకు చెందిన గుజ్జలపూడి హరి.. సినిమా రంగంపై ఉన్న మక్కువతో పంపిణీ రంగంలోకి దిగారు. అక్కడ ‘హరి వెంకటేశ్వర పిక్చర్స్’ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్థాపించి, నెల్లూరు ఏరియాలో తిరుగులేని పంపిణీదారుడిగా ఎదిగారు. వ్యాపార రంగంలో తనదైన వ్యూహాలతో ఎన్నో ఘన విజయాలను అందుకొని ట్రేడ్ వర్గాల్లో క్రేజీ డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్నారు.
సినిమా బిజినెస్‌పై ఉన్న అపారమైన పట్టుతో ఆయన టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లైన వైజయంతీ మూవీస్, దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్ మరియు శ్రేష్ఠ మూవీస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ల చిత్రాలను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేశారు. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేవలం డిస్ట్రిబ్యూటర్‌గానే కాకుండా, తమిళంలో మంచి విజయం సాధించిన పలు చిత్రాలను తెలుగులోకి డబ్ చేసి నిర్మాతగా కూడా సత్తా చాటారు.
హరి ఆకస్మిక మరణవార్త విన్న టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జున తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా నివేదిస్తూ.. “గుజ్జలపూడి హరికుమార్ గారి మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌తో ఆయనకు ఎంతో కాలంగా మంచి అనుబంధం ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా గాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు, నెల్లూరు ఏరియా థియేటర్ యాజమాన్యాలు హరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించడం పంపిణీ రంగానికి తీరని లోటని సినీ వర్గాల్లో ఉన్నాయి. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తరలివెళ్తున్నారు.