
భారతదేశం
ఓయ్-సయ్యద్ అహ్మద్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026) చురుగ్గా సాగుతోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకూ జరగనుంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఓటర్ల పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. అయితే ప్రయాణాలపై విధించిన ఆంక్షల కారణంగా ఓటర్లు సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ టీవీకే పార్టీ అధినేత విజయ్ (విజయ్) ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాశారు. తమిళనాడు ఎన్నికల్లో తిరుచిరాపల్లి తూర్పు , పెరంబూర్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న విజయ్.. పోలింగ్ సమయాన్ని రాత్రి 8:00 గంటల వరకు మరో రెండు గంటలు పొడిగించాలని కోరుతూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. ప్రయాణ అంతరాయల కారణంగా ఆలస్యంగా వచ్చే ఓటర్ల సంఖ్య భారీగా పెరగడం, పొడవైన క్యూలలో వేచి ఉండాల్సిన అనివార్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రభావితమైన అన్ని నియోజకవర్గాలలో పోలింగ్‌ను రాత్రి 8 గంటల వరకు పొడిగించాలని విజయ్ లేఖలో పేర్కొన్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ. ఓవైపు అధికార డీఎంకే కూటమి, మరోవైపు అన్నాడీఎంకే కూటమి మధ్య ముఖాముఖి పోరు నెలకున్నట్లు సర్వేలు స్పష్టం చేశాయి. అదే సమయంలో విజయ్ పార్టీ టీవీకే కూడా భారీగానే ఓట్లు చీలుస్తున్నట్లు కూడా నివేదికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఓటు కీలకంగా మారింది. దీంతో పోలింగ్ రోజు భారీ స్థాయిలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇదే విజయ్ కూడా పోలింగ్ గంటలు పెంచాలని ఈసీని కోరినట్లు తెలుస్తోంది.