
అంతర్జాతీయ
ఓయ్-కొరివి జయకుమార్
నైజర్ దేశంలోని విస్తారమైన సహారా ఎడారిలో హృదయ విదారక ఘటన జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ లారీ ఎడారి మధ్యలో చెడిపోవడంతో, తాగునీరు లేక దాదాపు మూడు రోజుల పాటు తీవ్ర ఎండల్లో చిక్కుకుపోయిన 49 మంది దాహార్తితో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆఫ్రికా ఖండాన్ని దిగ్భ్రాంతికి గురిచేయగా.. సహారా ఎడారిలో ప్రయాణాల ప్రమాదకర పరిస్థితులను మరోసారి ప్రపంచానికి గుర్తుచేసింది.
అధికారుల వివరాల ప్రకారం.. బాధితులంతా ఈద్-ఉల్-అధా (బక్రీద్) పండుగ సందర్భంగా మాలి దేశానికి వెళ్లి తిరిగి నైజర్‌కు వస్తున్నారు. ప్రయాణం మధ్యలో వారి లారీ సహారా ఎడారిలోని నిర్మానుష్య ప్రాంతంలో అకస్మాత్తుగా చెడిపోయింది. వాహనం నిలిచిపోవడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. ప్రయాణికుల వద్ద ఉన్న పరిమిత నీరు, ఆహారం కొద్ది గంటల్లోనే అయిపోగా.. సహాయం కోసం ఎవరినీ సంప్రదించే అవకాశం లేకపోయింది. 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదైన ఉష్ణోగ్రతలు, మండే ఎండలు, ఎడారి వాతావరణ పరిస్థితి మరింత దారుణంగా మారింది.

ఆయితే ఎడారి మధ్యలో ఎటు చూసినా ఇసుక తిన్నెలే కనిపించడంతో ప్రయాణికులకు తాగునీరు లభించలేదు. రోజులు గడుస్తుండగా దాహం, అలసట, హీట్ స్ట్రోక్ కారణంగా ఒక్కొక్కరుగా కుప్పకూలిపోయారు. చివరకు 49 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, సహాయం అందే అవకాశం లేకపోవడం, మొబైల్ సిగ్నల్ లేకపోవడం కూడా ఈ భారీ ప్రాణనష్టానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
ఈ విషాద ఘటనలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారు ఎడారిలోనే నీటి కోసం నడక కోసం. తీవ్ర ఎండలను తట్టుకుంటూ దాదాపు 80 కిలోమీటర్ల దూరం చేరుకున్నారు. అక్కడ కొంత ఉపశమనం పొందిన వారు అస్సామక పట్టణానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. వారి సమాచారంతోనే సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరాయి.
సంఘటనా స్థలంలో భయానక దృశ్యాలు..
సహాయక బృందాలు ఎడారిలోని ఘటనాస్థలానికి చేరుకున్నప్పుడు అక్కడ హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. లారీ చుట్టూ ప్రయాణికుల మృతదేహాలు ఉండగా, మరికొందరు నీడలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతదేహాలు తీవ్ర మంటల ప్రభావంతో కుళ్లిపోయే ప్రమాదం ఉండటంతో, అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని సామూహిక సమాధుల్లో ఖననం చేశారు.

ఈ ఘటనపై నైజర్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. లారీ సాంకేతిక లోపాల కారణంగా చెడిపోయిందా? లేక నిర్వహణ లోపాలున్నాయా? అనే విచారణ కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎడారి మార్గాల్లో అత్యవసర నీటి కేంద్రాలు, రెస్క్యూ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు నిపుణులు సూచిస్తున్నారు.