
నటీనటులు: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, జె.డి.చక్రవర్తి, శ్రీవిష్ణు, మానస చౌదరి, శుభలేఖ సుధాకర్, హర్షవర్థన్
సంగీతం: స్వీకార్ అగస్తి
సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్ చింత
ఎడిటింగ్: విప్లవ్ నిషాదం
కథ: సూర్యప్రకాశ్ జోశ్యుల
నిర్మాతలు: కళ్యాణ్ చక్రవర్తి మంతెన, భానుకిరణ్ ప్రతాప్, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ కుమార్
దర్శకత్వం: కశ్యప్ శ్రీనివాస్
విడుదల తేదీ: 01.05.26
సినిమా నిడివి: 140 నిమిషాలు
దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయమైన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత హీరోగా అవతారమెత్తి కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు. తాజాగా తరుణ్ హీరోగా కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘గాయపడ్డ సింహం’ విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? డిఫరెంట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ:
దరహాస్(తరుణ్ భాస్కర్) ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అతని పెళ్లి కొన్ని కండిషన్స్ పెడుతుంది. అందులో ఒకటి దరహాస్ అమెరికా వెళ్లాలి. ఆమె కోరిక ప్రకారం అన్నీ సిద్ధం చేసుకొని అమెరికా వెళ్తాడు. అమెరికాలో ఉంటున్న విదేశీయుల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా చాలా మంది ఇండియన్స్‌ను తిరిగి పంపించేస్తారు. అందులో దరహాస్ కూడా ఉంటాడు. దాంతో ట్రంప్‌పై విపరీతమైన కోపం పెంచుకుంటాడు. అతనిపై చేతబడిని ప్రయోగించాలని నిర్ణయించుకుంటాడు. భైరవ్‌దాస్(శ్రీవిష్ణు)కి కాంట్రాక్ట్ ఇస్తాడు. ఆ కోసం బ్రూటల్ ధర్మా(జె.డి.చక్రవర్తి) అందులో ఇరుక్కున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? దరహాస్, బ్రూటల్ ధర్మ, భైరవ్‌దాస్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
తెలుగు దర్శకులు, నిర్మాతలు, కథా రచయితలు.. తమ పైత్యంతో ప్రేక్షకుల మెదడుని ఎలా జుర్రుకుంటున్నారు అనే దానికి నిదర్శనం ఈ సినిమా. అర్థం లేని కథ, ప్రేక్షకులకు చిర్రెత్తించే, చిరాకు తెప్పించే కథనం, మాటలు, సన్నివేశాల సమాహారమే ఈ సినిమా. సినిమాలో ఎవరి క్యారెక్టర్‌నూ సరిగా డిజైన్ చేయలేదు. ప్రధాన కథే లోపభూయిష్టంగా ఉండటంతో మిగిలినవేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సినిమాల్లో అవుట్ డేటెడ్‌గా చెప్పుకునే చేతబడి, బ్లాక్ మ్యాజిక్ వంటి అంశాలను ఈ టెక్నాలజీ యుగంలోకి తీసుకొచ్చి ప్రేక్షకులంటే దర్శకనిర్మాతలకు, రచయితలకు ఎంతటి చులకన భావం ఉందో నిరూపించారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఒక్క సీన్ గానీ, ఒక్క డైలాగ్ గానీ ప్రేక్షకులు స్పందించేలా లేవు. పోకిరి, కెజిఎఫ్, బొమ్మరిల్లు వంటి సినిమాల్లో సీన్స్‌తో చేసిన స్ఫూవ్ మరీ పేలవంగా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు, ప్రేక్షకులను ఎలా ఎంటర్‌టైన్ చేయాలనుకున్నాడు అంటే ఎవ్వరికీ అర్థం కాదు. దీనికి తోడు ఈ సినిమాకి రెండో భాగం కూడా ఉందని సినిమా ఎండింగ్‌లో ఉంది.
నటీనటులు:
హీరోగా నటించిన తరుణ్ భాస్కర్ నుంచి ఫరియా అబ్దుల్లా, శుభలేఖ సుధాకర్, జె.డి.చక్రవర్తి, హర్షవర్థన్ వంటి వారి వరకు ఎవరి పెర్ఫార్మెన్స్ గురించి కూడా చెప్పుకునే వీలు లేదు. ఎవరికి వారు ఓవర్ యాక్షన్ చేసేందుకే ఎక్కువ ప్రయత్నించారని ప్రతి సీన్‌లో అర్థమవుతుంది.
నిపుణులు సాంకేతిక:
కథ, కథనాలు, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయో టెక్నికల్ సైడ్ కూడా ఎలాంటి ఎస్సెట్స్ ఈ సినిమాకి లేవు. ఎలాంటి క్వాలిటీలేని సినిమాటోగ్రఫీ, దానికి తగ్గినట్టుగానే ఉన్న ఎడిటింగ్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి. డైరెక్టర్ తర్వాత తన సంగీతంతో ప్రేక్షకులను ఆడుకున్నాడు మాయజిక్ డైరెక్టర్. డైరెక్టర్ విషయానికి వస్తే.. ఇంతకంటే దారుణంగా సినిమా తియ్యడం ఏ డైరెక్టర్‌కీ సాధ్యంకాదని నిరూపించాడు.
ప్లస్ పాయింట్స్:
చెప్పుకోవడానికి ఒక్క ప్లస్ పాయింట్ కూడా సినిమాలో లేదు
మైనస్ పాయింట్లు:
సినిమా అంతా మైనస్ పాయింట్స్‌తోనే నిండిపోయింది
ఫైనల్‌గా చెప్పాలంటే..
‘గాయపడ్డ సింహం’ చూసి డెఫినెట్‌గా ప్రేక్షకులు గాయపడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. గాయాలు పడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడొచ్చు.
రేటింగ్: 1.5/5
– జి.హరా
నిరాకరణ: ఈ సమీక్షలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు/అభిప్రాయాలు రచయిత పంచుకున్న వ్యక్తిగత అభిప్రాయాలు/అభిప్రాయాలు మరియు సంస్థ వాటికి బాధ్యత వహించదు. వీక్షకుల విచక్షణతో వారికి ప్రతిస్పందించే ముందు సలహా ఇవ్వబడుతుంది.