Home Uncategorized వ్యవసాయ పంపు కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల అమర్చడాన్ని వ్యతిరేకించండి

వ్యవసాయ పంపు కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల అమర్చడాన్ని వ్యతిరేకించండి

by VRM Media
0 comments

VRM మీడియా
ఖమ్మం ప్రతినిధి
చిన్నంశెట్టి రాంబాబు

తల్లాడ మండల కేంద్రంలోని కుర్నవల్లిలో తెలంగాణ రైతు సంఘం తల్లాడ మండల కమిటీ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించబడింది. రైతు సంఘం మండల అధ్యక్షులు కళ్యాణపు కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంతు రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా ప్రైవేటీకరించే లక్ష్యంతో వ్యవసాయ పంపు కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు.
మొదట ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల అమలుకు అనుకూలంగా జీవో తీసుకురావడం రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పటికే రసాయనిక ఎరువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాటు పురుగుమందుల ధరలు కూడా పెరిగి రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల పెంపు కూడా నామమాత్రంగానే ఉందని, క్వింటా పెసలకు కేవలం రూ.12, మొక్కజొన్నలకు రూ.10 మాత్రమే పెంచడం రైతులపై వివక్షకు నిదర్శనమని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీల లాభాలపై చూపుతున్న శ్రద్ధ రైతుల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు తాతా భాస్కరరావు, సేలం సత్యనారాయణ రెడ్డి, రైతు సంఘం మండల కార్యదర్శి నల్లమోతు మోహన్‌రావు, అయినాల రామలింగేశ్వరరావు, కట్ట దర్గయ్య, దొబ్బల సురేష్, ఐలూరి రామిరెడ్డి, ఐలూరి కోటిరెడ్డి, ఐలూరి సత్యనారాయణ రెడ్డి, బొగ్గుల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2,807 Views

You may also like

Leave a Comment