
భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం జరిగింది. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్ అరెస్ట్ అయ్యారు. బొగ్గు కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ఆయనను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఢిల్లీలో ఆయనను తీసుకెళ్లారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీ చేస్తూ ఈడీ అధికారులు ఆయనను నేడు ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
ఈ కేసు అక్రమ మైనింగ్, హవాలా లావాదేవీలకు సంబంధించి 2020 నవంబర్‌లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు అనుబంధం. అసన్‌సోల్ సమీపంలోని కునుస్టోరియా, కజోరా ప్రాంతాలను ఈస్టర్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన గనుల నుండి కోట్ల విలువైన బొగ్గును అక్రమంగా తరలించినట్లు సీబీఐ ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. పరిశోధన సాగించడానికి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది.

ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న హవాలా ఆపరేటర్ ఐప్యాక్ రిజిస్టర్డ్ సంస్థకు కోట్ల రూపాయల లావాదేవీలను మళ్లించినట్లు ఈడీ విచారణలో తేలినట్లు సమాచారం. ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ పలుచోట్ల సోదాలు చేసింది. ఏప్రిల్ 2న చందేల్ కు చెందిన ఢిల్లీ నివాసంతో పాటు, ఆప్ సహవ్యవస్థాపకుడు రిషి రాజ్ సింగ్ బెంగళూరు కార్యాలయం, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్ ముంబై నివాసంపై తనిఖీలు జరిగాయి.
అంతకుముందు జనవరి 8న, ఐప్యాక్ కార్యాలయం, దాని వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ కోల్‌కతా నివాసాలలోనూ ఈడీ సోదాలు చేసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర అధికారులతో అక్కడికి చేరుకుని కొన్ని పత్రాలను తీసుకువెళ్లడంతో పెద్ద వివాదం చెలరేగింది. ఈ సోదాలను అడ్డుకుని, సంబంధిత పత్రాలు, డివైజ్‌లను తొలగించారని ఈడీ ఆరోపించింది.
తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలను ఖండించింది. ఎన్నికలకు ముందు తమ పార్టీ ప్రచార వ్యూహాలకు సంబంధించిన సామగ్రిని ఈడీ లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ ఎదురుదాడికి దిగింది. సోదాలకు ఆటంకం కలిగించిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 23, 29 తేదీల్లో జరుగుతున్నాయి. ఐప్యాక్ 2021 నుండి తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ సలహాలను అందిస్తోంది.