
భారతదేశం
ఓయ్-సాయి చైతన్య
తమిళనాడు ఎన్నికలు ఆసక్తిగా మారుతున్నాయి. తొలి సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖ హీరో విజయ్ కు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. సర్వే నివేదికల ఆధారంగా విజయ్ తన వ్యూహాలను అమలు చేస్తున్నారు. రెండు నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నారు. ఈ సమయం లో విజయ్ పైన ఏపీ డిప్యూటీ సీఎం… ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పోలింగ్ సమీపిస్తున్న వేళ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తమిళనాడు ఎన్నికల్లో ఇప్పుడు త్రిముఖ పోటీ. ఎన్డీఏ- డీఎంకే కూటమితో పాటుగా సినీ హీరో విజయ్ పార్టీ బరిలో నిలిచారు. సర్వేలు తమిళనాడు ఫలితాల పైన ఇప్పటికే పలు రిపోర్ట్ లు వెల్లడించాయి. విజయ్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తారు.. ఎవరి ఓటింగ్ కు గండి కొడతారు.. తాను పోటీ చేసే రెండు స్థానాల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తారనే ఆసక్తి పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఏపీలో పవన్ సైతం రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసారు. ఇప్పుడు విజయ్ సైతం పొత్తులు లేకుండా బరిలో దిగారు. ఇక.. ఎన్డీఏలో విజయ్ చేరిక కోసం చివరి వరకు ప్రయత్నాలు జరిగాయి. అయితే, విజయ్ సింగిల్ గా పోటీ చేసేందుకే నిర్ణయించారు. ఈ సమయంలోనే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ నేతగా ఉన్న పవన్ కల్యాణ్ ఇటీవల ‘జనసేనాని విత్ జెన్‌జీ’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో విజయ్‌కు సలహా ఇస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆసక్తి కర సమాధానం ఇచ్చారు.

విజయ్ సమర్ధుడు.. పెద్ద స్టార్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయ్ పైన పవన్ వ్యాఖ్యలు చేసారు. విజయ్ సమర్ధుడని, చాలా పెద్ద స్టార్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తి ప్రజలకు సేవ చేయడం గొప్ప విషయం. తాను ఎవరికీ సలహా ఇవ్వనని… తన పిల్లల విషయంలో కూడా అంతేనని పవన్ తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరూ తమదైన మార్గంలో ముందుకు వెళ్లాలని చెప్పారు. ఇక విజయ్ విషయకొస్తే ఆయన చాలా పెద్ద స్టార్… ప్రతి పౌరుడికి రాజకీయాల్లోకి రావడానికి, పార్టీ స్థాపించడానికి హక్కు ప్రచారం. విజయ్ ఏ పాత్రలో ఉన్నా ప్రజలకు సేవ చేయడం గొప్ప విషయమని తాను కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. పాలిటిక్స్‌లోకి రావాలంటే ఎలాంటి త్యాగాలు చేయాలి? అని ఓ యువకుడు అడిగిన ప్రశ్నించాడు. అందుకు త్యాగాలు చేయకూడదు అని పవన్ కల్యాణ్ బదులిచ్చారు. రాజకీయాన్ని ఎప్పుడూ వ్యాపార కోణంలో చూడకూడదని చెప్పారు. ప్రజలకు సేవ చేసే ఆలోచన ఉంటే ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని సలహా ఇచ్చారు. అలా వినియోగించుకుంటే సోషల్ మీడియా ఎంతో పవర్ ఫుల్ అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.