VRM మీడియా అయినవిల్లి భద్రం
పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ , టూరిజం శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి గార్లతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన
పవిత్ర గోదావరి నదిని కాలుష్య కోరల నుండి రక్షించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఆంధ్ర పేపర్ మిల్స్ (APPM) నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థ జలాలు నేరుగా గోదావరి నదిలోకి కలుస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధాన ప్రదేశం వెంకటనగరం తూర్పులంక లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ పర్యటనలో ఆయనతో పాటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ టూరిజం శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ , తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి , స్థానిక ఎమ్మెల్యేలు మరియు కూటమి ఉమ్మడి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఫ్యాక్టరీల నుండి వస్తున్న మురుగు, రసాయన జలాలు గోదావరి పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా, స్థానిక ప్రజల ఆరోగ్యంతో పాటు జలచరాల మనుగడకు ముప్పుగా మారిన తీరును డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ స్వయంగా వీక్షించారు. వ్యర్థాలు కలుస్తున్న చోట నీటి రంగు మారిపోవడం, దుర్వాసన వస్తుండటంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల ఉదాసీనత వల్లే గోదావరి మాత ఇంతలా కాలుష్యానికి గురైందని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…”కోట్లాది మంది ప్రజల జీవనాధారమైన, ఎంతో పవిత్రమైన గోదావరి నదిని పరిశ్రమల వ్యర్థాలతో విషతుల్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోం. పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యం. నిబంధనలను అతిక్రమించి నదిలోకి వ్యర్థాలను వదులుతున్న పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి (PCB) ద్వారా కఠిన చర్యలు తీసుకుంటాం. తక్షణమే ఇందుకు సంబంధించిన ప్రత్యామ్నాయ ప్లాంట్లు (STP/ETP) సక్రమంగా పనిచేసేలా చూసే బాధ్యత యాజమాన్యాలదే.” అని స్పష్టం చేశారు.
మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతని, నదీ జలాలను కలుషితం చేసే ఏ శక్తినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ సమస్యపై సమగ్ర విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, స్థానిక ప్రజలు, రైతులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఈ కాలుష్య సమస్యను డిప్యూటీ సీఎం దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి, స్వయంగా ఇక్కడికి వచ్చి పరిశీలించడం శుభపరిణామమన్నారు. గోదావరిని కాలుష్య రహితంగా మార్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధులుగా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పారు.
ఈ పరిశీలన అనంతరం, నదిలో కలిసే నీటి నాణ్యతపై తక్షణమే ల్యాబ్ పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి మరియు నీటిపారుదల శాఖ అధికారులను డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పరిశ్రమల యాజమాన్యాలు పర్యావరణ చట్టాలను పక్కాగా అమలు చేయాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ ఉన్నతాధికారులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
