డీఈఓ హామీతో ఆందోళన విరమణ
సోమవారం నాటికి ప్రాథమికోన్నత పాఠశాలగా మార్పు ప్రక్రియ పూర్తి చేస్తామని భరోసా
వి ఆర్ ఎం న్యూస్ బాల మౌలాలి
తేది :12.06.26
ఒంటిమిట్ట
పాఠశాలల హేతుబద్ధీకరణలో భాగంగా గత విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాలను ప్రాథమిక పాఠశాలగా మార్చిన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని, చిన్నకొత్తపల్లి పాఠశాలను తిరిగి ప్రాథమికోన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేయాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం ఉదయం పాఠశాల ఆవరణలో ధర్నా నిర్వహించారు. డీఈఓ గతంలో ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే, 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల హేతుబద్ధీకరణలో భాగంగా చిన్నకొత్తపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ప్రాథమిక పాఠశాలగా మార్చారు. ఈ నిర్ణయంపై గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2025 జూన్ 17న భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ సమయంలో జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ పాఠశాలను సందర్శించి, గ్రామ ప్రజల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని పాఠశాలను తిరిగి ప్రాథమికోన్నత పాఠశాలగా మారుస్తామని, చిన్నకొత్తపల్లి పాఠశాలను వ్యక్తిగతంగా దత్తత తీసుకుని అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అయితే 2025–26 విద్యా సంవత్సరం ముగిసి, 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ పాఠశాల హోదాలో ఎలాంటి మార్పు జరగకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని విద్యార్థులు సమీప ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ముఖ్యంగా బాలికలు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని ఆరోపిస్తూ పాఠశాల వద్ద ధర్నాకు దిగారు.
సమాచారం అందుకున్న ఒంటిమిట్ట మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మయ్య వెంటనే పాఠశాల వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్‌తో ఫోన్‌లో మాట్లాడి తల్లిదండ్రుల ఆందోళనను వివరించారు. దీనికి స్పందించిన డీఈఓ, చిన్నకొత్తపల్లి పాఠశాలను తిరిగి ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలు, పరిపాలనా చర్యలు ఇప్పటికే పూర్తి చేశామని, ప్రస్తుతం తుది ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. సోమవారం నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని, అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముందని హామీ ఇచ్చారు.
డీఈఓ స్పష్టమైన భరోసా ఇవ్వడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు తమ ఆందోళనను విరమించారు. హామీ మేరకు చర్యలు తీసుకోకపోతే మరింత ఉధృతంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సౌకర్యాలను తగ్గించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి బొబ్బిలి రాయుడు, సుబ్బరాయుడు, భాస్కర్, విజయరామయ్య, అశోక్, మధు, పాఠశాల చైర్మన్ చైతన్య, సుబ్బయ్య, వెంకటసుబ్బయ్య, అనూష, గౌతమి, జయలక్ష్మి, రాణి, గౌరీతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

