Home వార్తలుఖమ్మం టీవీఎస్ కంపెనీకి రూ.60 వేల జరిమానా

టీవీఎస్ కంపెనీకి రూ.60 వేల జరిమానా

by VRM Media
0 comments

Vrm Media ప్రతినిధి వెంకట్ ఖమ్మం

  • “అపాచీ” బండి ఇంజిన్ సమస్యపై మొర పెట్టుకున్నా పట్టించుకోని షోరూం నిర్వాహకులు
  • విసుగెత్తి వినియోగదారుల ఫోరంలో కేసు వేసిన వాహదారుడు
  • అపరాధ రుసుం విధిస్తూ తీర్పు చెప్పిన కమిషన్ ఇంచార్జ్ చైర్మన్ వడ్లమాని లలిత, సభ్యురాలు మాధవి లత
  • టీవీఎస్ పై పట్టు విడవకుండా పోరాడి ఖమ్మంలో ఓ వినియోదారుని విజయం
    మార్కెట్ లో వినియోగదారులకు అనేక రూపాల్లో జరిగే నష్టాలు, మోసాలపై పట్టుదలతో పోరాడితే విజయం సాధించవచ్చని నిరూపించాడు ఖమ్మం నగరానికి చెందిన ఓ యువకుడు. ఈ ఫలితంగా ప్రముఖ టీవీఎస్ కంపెనీకి వినియోగదారుల కమిషన్ రూ.60 వేల అపరాధ రుసుమును విధించింది. వినియోగదారుడు ఎదుర్కొన్న మానసిన ఇబ్బందికి, వెచ్చించిన ఖర్చును కూడా లెక్కకట్టి అపరాధ రుసుముకు జోడించడం విశేషం. ఈ మేరకు ఖమ్మం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇంచార్జ్ చైర్మన్ వడ్లమాని లలిత, సభ్యురాలు మాధవి లత తీర్పునిచ్చారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే… ఖమ్మం నగరం నరసింహ స్వామి గుట్ట ప్రాంతానికి చెందిన నితిన్ విజేత రామిశెట్టి అనే విద్యార్థి హైదరాబాదు నగరంలోని మలక్ పేట టీవీఎస్ షోరూంలో తనకు ఎంతో ఇష్టమైన టీవీఎస్ అపాచీ ద్విచక్ర వాహనాన్ని 2021 మే నెలలో కొనుగోలు చేశాడు. ఈ బండిని అక్షరాలా 2,65,234లను వెచ్చించి కొనుగోలు చేశాడు. అయితే వాహనం కొంతకాలం పాటు బాగానే నడిచింది. ఆ తర్వాత సమస్యలు మొదలయ్యాయి. వాహనం నడుపుతుండగా ఇంజిన్ బాగా వేడెక్కడంతో పాటు ప్రయాణం మధ్యలో అకస్మాత్తుగా ఆగుతూ ఉండేది. ఇలా అనేక సార్లు మొరాయించడంతో ఆ విద్యార్థి షోరూం నిర్వాహకులను ఆశ్రయించాడు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో సదరు వినియోగదారుడు తనకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు న్యాయవాది వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్ ని సంప్రదించాడు. ఆయన ద్వారా ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించి కేసును దాఖలు చేశారు. సాక్షాధారాలు, పూర్వాపరాలను పరిశీలించిన కమీషన్ తుది తీర్పును తాజాగా వెలువరించింది. వినియోగదారుడు కొనుగోలు చేసిన టీవీఎస్ అపాచీ వాహనం సరైన రీతిలో ఉండేలా అవసరమైన వాహన పరికరాలు ఉచితంగా అందజేయాలని కమీషన్ కంపెనీని ఆదేశించింది. అలాగే రూ.50 వేల అపరాధ రుసుమును విధించింది. అంతటితో ఆగకుండా ఫిర్యాదుదారుడు ఇన్నేళ్లు ఎదుర్కొన్న మానసిక వేదనతో పాటు ఖర్చులను సైతం కమిషన్ పరిగణలోకి తీసుకుంది. ఇందుకు మరో పదివేల రూపాయల మొత్తాన్ని 45 రోజుల వ్యవధిలో చెల్లించవలసిందిగా ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పునిచ్చింది.

క్యాప్షన్లతో మోసం..

ప్రయాణం మధ్యలో ఆగిపోతుండటంతో అయిన ఖర్చులను చెల్లించవలసిందిగా సదరు ద్విచక్ర వాహన కంపెనీని వినియోగదారుడు ఆశ్రయించగా BS V1 వాహనాలు ఇలా వేడి రావటం మామూలేనని నిర్వాహకులు నిరాకరించారని ఖమ్మం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కు ఫిర్యాదుదారు తరపు న్యాయవాదులు వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్, కొలికొండ శరత్ బాబు కమీషన్ ఎదుట నివేదించారు. వాహన కంపెనీ అడ్వర్టైజ్మెంట్ లో క్రాప్టెడ్ బై ఛాంపియన్స్, క్రాఫ్టెడ్ టు కాంకర్ అనే క్యాప్షన్స్ పెడుతూ యువకుల్ని మోసం చేస్తున్నారని వివరించారు. తమ కంపెనీ వాహనాలను ప్రభుత్వమే అనుమతించిందని, ఇచ్చిన వాహనం స్థానంలో మరో కొత్త వాహనం కానీ, మరమ్మతులు చేసి ఇవ్వడం గానీ జరగదని కంపెనీ నిర్వాహకులు వినియోగదారుడిని బుకాయించారని తెలిపారు. దీంతో స్పందించిన ఖమ్మం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ మేరకు తాజా తీర్పుని వెలువరించడంతో టీవీఎస్ కంపెనీకి చుక్కెదురైంది. ఫిర్యాదుదారు నితిన్ విజేత రామిశెట్టి తరపున వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్, కొలికొండ శరత్ బాబు న్యాయవాదులుగా ఈ కేసును జిల్లా కమిషన్ లో నమోదు చేసి తమ వాదనలు వినిపించడం ద్వారా టీవీఎస్ కంపెనీపై విజయాన్ని సాధించారు.

2,829 Views

You may also like

Leave a Comment