Home Uncategorized ఇసుకతో జారిన రోడ్…డివైడర్‌ను ఢీకొన్న కారుతృటిలో తప్పిన ప్రమాదం…

ఇసుకతో జారిన రోడ్…డివైడర్‌ను ఢీకొన్న కారుతృటిలో తప్పిన ప్రమాదం…

by VRM Media
0 comments

VRM media అయినవిల్లి భద్రం

ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు
ఇసుక లారీల అడ్డదిడ్డంగా రాకపోకలు…

అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మండిపాటు…

తూర్పుగోదావరి సీతానగరం, ఏప్రిల్ 27.

సీతానగరం మండలం రాజంపేట గ్రామం సమీపంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డుపై పేరుకుపోయిన ఇసుక కారణంగా ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
స్థానికుల సమాచారం మేరకు మండలంలోని కాటవరం, మునికొడవలి, రఘుదేవపురం, సింగవరం ప్రాంతాల్లో నడుస్తున్న ఇసుక ర్యాంపుల నుంచి రోజుకు వందలాది లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. లారీలపై అధికంగా ఇసుక లోడింగ్ చేయడంతో పాటు పట్టాలు (కవర్లు) వేయకుండా ప్రయాణించడం వల్ల ఇసుక రహదారిపై జారిపడుతోంది. ఫలితంగా రోడ్డంతా ఇసుకతో నిండిపోవడంతో ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం పెరిగింది. ఇప్పటికే పలుచోట్ల చిన్నా పెద్దా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఇప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, మైన్స్, ఆర్టీవో శాఖల అధికారులు తమ బాధ్యతలను విస్మరించి చూస్తూ ఊరుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ అధిక లోడుతో, రక్షణ చర్యలు లేకుండా తిరుగుతున్న లారీలపై ఎలాంటి తనిఖీలు జరగడం లేదని విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రహదారులపై పేరుకుపోయిన ఇసుకను వెంటనే తొలగించాలని, నిబంధనలు పాటించని లారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇసుక ర్యాంపుల వద్ద పర్యవేక్షణ కట్టుదిట్టం చేసి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రహదారుల భద్రతపై అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

2,809 Views

You may also like

Leave a Comment