

శ్రీ నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. (అగ్లీ స్టోరీ మూవీ రివ్యూ)
కథ:
చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన నేహా (అవికా గోర్)ను ఆమె మావయ్య (శివాజీ రాజా) తమ ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. వరుసకు మరదలైన నేహాపై మావయ్య కొడుకు కార్తీక్ (నందు) చిన్నప్పటి నుంచి పిచ్చి ప్రేమ పెంచుకుంటాడు. నేహ వేరే వారితో మాట్లాడినా భరించలేని సైకో మనస్తత్వం కార్తీక్‌ది. అయితే నేహాకు చిన్నతనం నుంచి గౌతమ్ (రవితేజ మహాదాస్యం) అంటే ఇష్టం. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ఆ విషయం తెలిసి కార్తీక్ మరింత సైకోలా మారతాడు. అసలు ఇష్టం లేకపోయినా, చిన్నప్పటి నుంచి తను పెట్టే టార్చర్‌ను భరించలేకపోయినా నేహా చివరకు కార్తీక్‌ను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? పెళ్లైన తర్వాత నేహాకు కార్తీక్ ఇంకెంత నరకం చూపించాడు? చివరకు ఈ దంపతుల కథ ఎలాంటి మలుపు తిరిగింది? అనేదే ఈ ‘అగ్లీ స్టోరీ’.
విశ్లేషణ:
సమాజంలో ప్రేమ పేరుతో జరిగే దాడులు, పెళ్లి తర్వాత భార్యలపై భర్తలు చూపే అతి పొసెసివ్‌నెస్, సైకోయిజం చుట్టూ దర్శకుడు ప్రణవ స్వరూప్ ఈ ‘అగ్లీ స్టోరీ’ని తెరకెక్కించాడు. పేరుకు తగ్గట్టే ఇదొక డార్క్ అండ్ రా స్టోరీ. భార్యాభర్తల మధ్య ‘సమ్మతి’ లేకపోతే ఆ బంధం ఎంత వికృతంగా మారుతుందో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు.
దర్శకుడు ప్రణవ స్వరూప్ ఈ సినిమాలో పాత్రలను చాలా క్లారిటీతో రాసుకున్నారు. కానీ, స్క్రీన్‌ప్లే విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకోవాల్సింది. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం, నేహా భయపడటానికి గల కారణాలు, కార్తీక్ సైకో ప్రవర్తనను స్థాపించారు. అయితే, ఇంటర్వెల్ వరకు హీరో సైకోయిజం చుట్టూనే సీన్లు రిపీట్ అవుతున్నట్లు అనిపించి కథనం కొంచెం స్లోగా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథలో కాస్త వేగం పెరుగుతుంది.
ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు సాగతీతగా అనిపించినా, సెకండాఫ్ వేగంగా సాగుతూ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసింది. అయితే కొన్ని సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్‌కు, సున్నిత మనస్కులకు కాస్త డిస్టర్బింగ్‌గా అనిపించవచ్చు. క్లైమాక్స్ మాత్రం ఒక మంచి జస్టిఫికేషన్‌తో ముగుస్తుంది. క్లైమాక్స్‌లో దర్శకుడు ఎటువంటి అనవసరమైన ఉపన్యాసాలు ఇవ్వకుండా, సమాజంలో పచ్చి నిజాన్ని చూపిస్తూ న్యాయం జరిగేలా ముగించడం ప్రేక్షకులకు సంతృప్తినిస్తుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
నందు తన కెరీర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. కార్తీక్ అనే సైకో భర్త పాత్రలో నందు జీవించేశాడు. కళ్లలోనే క్రూరత్వాన్ని, నిమిషాల్లో ప్రశాంతత నుండి కోపానికి మారే బాడీ లాంగ్వేజ్‌ను అద్భుతంగా పలికించాడు. ఇన్నోసెంట్ భార్యగా అవికా గోర్ తన నటనతో సినిమా స్థాయిని పెంచింది. మాటల కంటే తన ముఖ కవళికలతో భయాన్ని, బాధను అద్భుతంగా పండించి ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించింది. గౌతమ్‌గా రవిప్రకాష్ మహాదాస్యం తన పరిధి మేరకు నటించగా, మేనమామ పాత్రలో శివాజీ రాజా భావోద్వేగ నటనతో ఆకట్టుకున్నారు.
టెక్నికల్ పరంగా శ్రీ సాయి కుమార్ దారా సినిమాటోగ్రఫీ బాగుంది. క్లోజప్ షాట్స్‌తో క్యారెక్టర్ల ఎమోషన్స్‌ను చక్కగా క్యాప్చర్ చేశారు. శ్రవణ్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజర్ సెట్. ఉత్కంఠభరిత సన్నివేశాలను తన సంగీతంతో మరింత ఎలివేట్ చేశాడు. ఎడిటింగ్ సెకండాఫ్‌లో బాగుంది కానీ ఫస్టాఫ్‌లో కొన్ని రిపీటెడ్ సీన్స్ కట్ చేయాల్సి ఉంది. తక్కువ బడ్జెట్‌లోనైనా నిర్మాణ విలువలు నాణ్యతగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
నందు, అవికా గోర్ పెర్ఫార్మెన్స్
సెకండాఫ్
సినిమాటోగ్రఫీ
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్లు:
ఫస్టాఫ్‌లో సాగదీత, రిపీటెడ్ సీన్లు
కొన్ని డిస్టర్బింగ్ సీన్స్
ఫైనల్ గా..
‘అగ్లీ స్టోరీ’ ఒక బోల్డ్ అండ్ టాక్సిక్ లవ్ స్టోరీ. రియలిస్టిక్, సైకలాజికల్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ సినిమాని ఒకసారి చూడవచ్చు.
రేటింగ్: 2.25/5
నిరాకరణ: ఈ సమీక్షలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు/అభిప్రాయాలు రచయిత పంచుకున్న వ్యక్తిగత అభిప్రాయాలు/అభిప్రాయాలు మరియు సంస్థ వాటికి బాధ్యత వహించదు. వీక్షకుల విచక్షణతో వారికి ప్రతిస్పందించే ముందు సలహా ఇవ్వబడుతుంది.