జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి
ఖమ్మం, మే 04:
ఖమ్మం జిల్లాలో 2026-28 సంవత్సరం మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల నియామకం, అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, దీనిపై సమగ్ర విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపకులు మామిడి సోమయ్య, ఖమ్మం యూనియన్ నాయకులను కోరారు.
ఈ మేరకు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నానబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి నగేష్ ల నేతృత్వంలో ప్రతినిధి బృందం ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో, ఖమ్మం జిల్లాలో కమిటీ నియామకం, దరఖాస్తుల పరిశీలనలో పారదర్శకత లోపించిందని, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని,ముఖ్యంగా, ఖమ్మం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల నియామకంలో అన్ని జర్నలిస్టు సంఘాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించకుండా, ఒకే యూనియన్ కు చెందిన పలువురికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అభ్యంతరాలు
వ్యక్తమవుతున్నాయని,
కమిటీ నియామకం ప్రక్రియపై ముందస్తుగా ఎలాంటి అధికారిక నోటీసు లేదా సమాచారం ఇవ్వకుండానే గోప్యంగా నిర్వహించినట్లు జర్నలిస్టు వర్గాల్లో అనుమానాలు నెలకొన్నాయని, వారు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్ లో దాఖలు చేయబడిన దరఖాస్తుల పరిశీలనలో అనర్హమైన దరఖాస్తులకు కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం అందుతోందని, ప్రభుత్వ జీవో
నెం. 252 ప్రకారం నిర్దేశించిన ప్రమాణాలు, పత్రికల ప్రామాణికత, సర్క్యులేషన్ ఆధారాలు, సంస్థ అనుమతులు, నియామక పత్రాలు, అనుభవ ధృవీకరణ పత్రాలు, పే స్లిప్పులు వంటి ముఖ్యమైన పత్రాలను సమగ్రంగా పరిశీలించకుండానే అక్రిడిటేషన్ కార్డుల
జారీ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోందని, వాటిని బహిర్గతం చేస్తూ చర్యలు చేపట్టాలని కోరారు. వెరిఫికేషన్ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించకుండా తూతూ మంత్రంగా పూర్తి చేసినట్లు, మీడియా రంగంపై సరైన అవగాహన, ఫీల్డ్ అనుభవం లేని వారిని కూడా అర్హులుగా పరిగణించినట్లు అభ్యంతరాలు ఉన్నాయని, ఈ పరిణామాల వల్ల నిజంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉందనివారు ఆందోళన వ్యక్తం చేశారు.
అందువల్ల పై అంశాలపై సమగ్ర విచారణ జరిపించి, నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించబడిన దరఖాస్తులను పునఃపరిశీలించి, అర్హులైన, నిజమైన మీడియా ప్రతినిధులకు మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు జారీ అయ్యేలా, భవిష్యత్తులో మీడియా అక్రిడిటెషన్ కమిటీలో అన్ని సంఘాలకు తగిన ప్రాధాన్యత చర్యలు తీసుకోవాలని వినమ్రంగా కోరారు. ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించి, మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం, సమాన అవకాశాలు పాటించబడేలా చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో
టీడబ్ల్యూజెఎఫ్ (H-2843), అధ్యక్షులు నానబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అర్వపల్లి నగేష్, కోశాధికారి వేములకొండ రమేష్, ఉపాధ్యక్షులు కందరబోయిన నాగకృష్ణ మరియు మామిడాల కిరణ్, టీబీజేఎ జిల్లా కార్యదర్శి కాసోజు శ్రీధర్, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శి కరుణాకర్ సుదగాని, టిడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్షులు గంటేల కుమార్, టీబీజేఎ నగర అధ్యక్షులు ఎలుగోటి వెంకట్, సహాయ కార్యదర్శి చిన్నంశెట్టి రాంబాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్, రమ్య, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

