గిరిజనుల పొట్ట కొడితే సహించేది లేదు


అక్రమ లీజులు,పత్రాల ట్యాంపరింగ్‌పై తక్షణమే విచారణ చేపట్టాలి
జిల్లా కలెక్టర్, ప్రభుత్వం స్పందించాలి
ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోత రామారావు డిమాండ్
రంపచోడవరం మండలం
చుప్పరపాలెం గిరిజన క్వారీ వేదికగా జరుగుతున్న అక్రమ రాజకీయ దందాను ఆదివాసి గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. గిరిజనుల జీవనోపాధి కోసం ఏర్పడిన ‘చుప్పరపాలెం గిరిజన క్వారీ కార్మికుల కోపరేటివ్ సొసైటీ’ని అడ్డం పెట్టుకుని, నిబంధనలకు విరుద్ధంగా లక్షల రూపాయల విలువైన గ్రానైట్‌ను కొల్లగొడుతున్న వైనం దిగ్భ్రాంతి కలిగిస్తోందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోత రామారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ప్రకాశం జిల్లాకు చెందిన ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే తన మేనల్లుడు అబ్బురి వేణుగోపాల్‌ను బినామీగా పెట్టి, గిరిజన సొసైటీ హక్కులను కాలరాస్తున్నారు. 75:25 నిష్పత్తిలో జరిగిన ఒప్పందాన్ని తుంగలో తొక్కి, పత్రాలను ట్యాంపరింగ్ చేసి గిరిజన భాగస్వాములను మోసం చేయడం అత్యంత హేయం
అధికారుల అండతోనే అక్రమాలు
2031 వరకు లీజు గడువు ఉన్నప్పటికీ, రికార్డుల్లో ఫోన్ నంబర్లు మార్చి, జీఎస్టీ నంబర్లను అక్రమంగా మార్చుతూ మైనింగ్ నిబంధనలను ధిక్కరిస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసినా, ఎమ్మెల్యే అండ చూసుకుని పనులు ఆపకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.
గిరిజన హక్కుల ఉల్లంఘన
ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనుల ప్రయోజనాల కోసం కేటాయించిన సహజ వనరులను బయటి వ్యక్తులు, రాజకీయ శక్తులు దోచుకుంటుంటే జిల్లా కలెక్టర్, ఐటీడీఏ అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గిరిజన సొసైటీ మాజీ అధ్యక్షుడి ముసుగులో జరుగుతున్న ఈ మోసంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలి.
జిల్లా కలెక్టర్ వారు వెంటనే జోక్యం చేసుకుని, చుప్పరపాలెం క్వారీలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను నిలిపివేయాలనీ,
పత్రాల ట్యాంపరింగ్ మరియు ఫోర్జరీకి పాల్పడిన ఎమ్మెల్యే బినామీలు, వారికి సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
గిరిజన సొసైటీకి రావాల్సిన వాటాను, బకాయిలను వెంటనే చెల్లించి, గిరిజన కార్మికులకు న్యాయం చేయాలి.
ముఖ్యమంత్రి కార్యాలయానికి సైతం ఈ ఫిర్యాదు అందిన నేపథ్యంలో, ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి గిరిజన సంపదను కాపాడాలని, లేనిపక్షంలో ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని లోత రామారావు హెచ్చరించారు