Home Uncategorized కార్యకర్తలు సైనికులుగా పని చేయాలి

కార్యకర్తలు సైనికులుగా పని చేయాలి

by VRM Media
0 comments

ఎన్నిక ఏదైనా గెలుపు మనదే- రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్థి జగన్మోహన్ రాజు పిలుపునిచ్చారు

పేదల భూములు పేదలకే అందేలా కార్యచరణ
శ్రీరామ ఎత్తిపోతల పథకానికి రూ.12 కోట్లు
చెరువులో జాంబవంతుని విగ్రహానికి రూ.7 కోట్లు

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట

ఒంటిమిట్ట : “వచ్చే ఎన్నిక ఏదైనా గెలుపు తెలుగుదేశం పార్టీదే గెలుపు, కార్యకర్తలు సైనికుల్లా పని చేస్తే ప్రజల ఆశీస్సులతో మరింత భారీ విజయాన్ని సాధిస్తాం” అని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. ఒంటిమిట్టలో నిర్వహించిన వర్చువల్ మహానాడు కార్యక్రమంలో మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు చెందిన భూములు నిజమైన పేదలకే చెందేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని తెలిపారు. ఒంటిమిట్ట ప్రాంతంలో సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు శ్రీరామ ఎత్తిపోతల పథకానికి రూ.12 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. అలాగే ఒంటిమిట్ట చెరువులో జాంబవంతుని విగ్రహం ఏర్పాటుకు రూ.7 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ఒంటిమిట్ట అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా “ఒంటిమిట్ట డెవలప్‌మెంట్ అథారిటీ” ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రాజు హామీ ఇచ్చారు. కోదండరామాలయం అభివృద్ధితోనే ఒంటిమిట్ట అభివృద్ధి ముడిపడి ఉందని, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఒంటిమిట్ట చెరువును ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేసి ప్రజలకు ఆకర్షణీయమైన విహార కేంద్రంగా మార్చనున్నట్లు తెలిపారు.
ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టెక్స్టైల్ పార్కుతో పాటు ప్రత్యేక ఆర్థిక మండలులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒంటిమిట్ట మండలంలో ఇప్పటికే రూ.10 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. ఒంటిమిట్ట అభివృద్ధి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైందని, తెలుగుదేశం పార్టీ లేనిదే ఈ ప్రాంతానికి అభివృద్ధి లేదని జగన్మోహన్ రాజు స్పష్టం చేశారు. “మన బిడ్డల భవిష్యత్‌, గ్రామాల అభివృద్ధి తెలుగుదేశం పార్టితోనే సాధ్యం” అని అన్నారు. గ్రామస్థాయిలో నాయకత్వం బలోపేతం కావాలని, ప్రతి గ్రామంలో పార్టీ శక్తివంతం కావాలని పిలుపునిచ్చారు. పెత్తందారులకు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా రాజంపేట అబ్జర్వ్ చిట్టిబాబు మాట్లాడుతూ ఒంటిమిట్టలో మహానాడును పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని పంచాయతీలు, మండల పరిషత్ స్థానాలను కైవసం చేసుకునేలా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.

అనంతరం ఒంటిమిట్ట అబ్జర్వర్ నాయుడు మాట్లాడుతూ ఈ యుగానికి మహాపురుషుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు జాతి చేసుకున్న ఎన్నో జన్మల సుకృతమే ఎన్టీఆర్ రూపంలో కలిగిందన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గజ్జల నరసింహారెడ్డి, ఈశ్వరయ్య, కొత్తపల్లి బొబ్బిలి రాయుడు, ముద్దుకృష్ణారెడ్డి, ఎస్.వి. రమణ, చింతరాజుపల్లె రమణ, లాయర్ రామదాసు, బిల్లా లక్ష్మీనరసయ్య, శ్రీనివాసరాజు, ఆదినారాయణ, బి.వి. రమణ, ఆలూరు వెంకటసుబ్బయ్య, బుజ్జి, ఎం.వి. రమణ, చంద్రపాల్, బాలమునయ్య, మౌలాలి, దిలీప్, తదితరులు పాల్గోన్నారు.

2,802 Views

You may also like

Leave a Comment